15-10-2025 12:00:00 AM
-సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్న 783 మంది..
-అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను త్వరితగతిన పూర్తి చేయాలి
-అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా ఎంపికైన గ్రూప్-2 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న సాయంత్రం నియామక పత్రాలు అందించనున్నారు. శిల్పకళా వేదికలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ర్ట సచివాలయంలో మంగళవారం సీఎస్ కె. రామకృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
గ్రూప్- ద్వారా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం నియామక పత్రాలు అందిస్తారని తెలిపారు. వీరిలో దాదాపు 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని, ఈ కార్యక్రమానికి రాష్ర్ట మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యులను సాయంత్రం 4 గంటల లోపు శిల్పకళా వేదికలో అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ నియామకాల్లో అత్యధికంగా, సాధారణ పరిపాలన, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సుజ్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నారని తెలిపారు. రెవెన్యూ, హోం, జీఏడీ కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు బెనహర్ మహేష్ దత్ ఎక్కా, రిజ్వి, సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు లోకేష్ కుమార్, టీకే శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తదితర అధికారులు పాల్గొన్నారు.