15-10-2025 09:03:29 AM
జైసల్మేర్ : రాజస్థాన్ లోని జైసల్మేర్ బస్సు అగ్ని ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi ) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. "రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలతో నా ఆలోచనలు ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పీఎంవో అధికారిక ప్రకటన వెలువడింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (Prime Minister's National Relief Fund) నుండి ఆర్థిక సహాయాన్ని కూడా ఆ ప్రకటన ప్రకటించింది. "మరణించిన ప్రతి ఒక్కరి బంధువులకు PMNRF నుండి రూ.2 లక్షల ఎక్స్-గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వబడుతుంది" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
రాజస్థాన్ జైసల్మేర్(Jaisalmer Bus Fire)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది సజీవదహనం అయ్యారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు వెల్లడించారు. జైసల్మేర్ నుంచి బోధ్ పూర్ వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగాయని బాధితులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. రాజస్థాన్ బస్సు అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సాయంత్రం ప్రమాద స్థలాన్ని సందర్శించి, తరువాత జోధ్‌పూర్ ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు. నిన్న జైసల్మేర్ సమీపంలో జరిగిన ఒక విషాద రోడ్డు ప్రమాదంలో ఒక ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి, 20 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.