15-10-2025 12:00:00 AM
-ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ ఎదుటే గొడవ
-కరీంనగర్ డీసీసీ ఆఫీసు వద్ద ఘటన
కరీంనగర్, అక్టోబర్14 (విజయక్రాంతి): ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ డీసీసీ ఆఫీసులో ఉండగానే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం పరిశీలనకు రాగా వారి ఎదుటే గొడవకు దిగారు. నగర మహిళా కాంగ్రెస్ కమిటీలో తమ పేరు వద్దనడానికి మీరెవరు అంటూ గడ్డం కొమరమ్మ, గంట శ్రీనివాస్ అనుచరులతో డివిజన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తున్నామని అయినా తమకు గుర్తింపు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గొడవ పెద్దదవుతున్న క్రమంలో పరిస్థితిని గమనించిన జిల్లా నాయకులు భూమగౌడ్, ఆకుల నర్సయ్య, మదుపు మోహన్ వచ్చి వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందంటూ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.