28-11-2025 12:00:00 AM
సంగారెడ్డి, నవంబర్ 27(విజయక్రాంతి):జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణను నిస్పాక్షికంగా, పారదర్శకంగా, శాంతియుతంగా జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇద్దరు అధికారులను పరిశీలకులుగా నియమించింది. జిల్లాకు పంచాయితీ ఎన్నికల సాధారణ పరిశీలకు లుగా ఐఏఎస్ అధికారి పి.ఉదయ్ కుమార్ ను, వ్యయ పరిశీలకులుగా జిల్లా ఆడిట్ ఆఫీసర్ జి.రాకేష్ లను నియమించింది.
ఎన్నికల ప్రక్రియలో సాధారణ పర్యవేక్షణ, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఎన్నికల పరిశీలకులు ఇద్దరూ జిల్లాకు విచ్చేసారు.గురువారం సాధారణ పరిశీలకులు పి. ఉదయ్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి కంది మండలం కవలంపేట గ్రామంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, నామినేషన్లను పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకు నడు చుకోవాలని వారు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ సుధీర్ ఉన్నారు. వ్యయ పరిశీలకులు జి.రాకేష్ సంబంధిత అధికారులతో సమావేశమై ఎన్నికలలో అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసాపై నిఘా ఉంచాలన్నారు. నిబంధనల మేరకు పారదర్శకంగా నడుచుకోవాలని ఆదేశించారు.