calender_icon.png 6 November, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సలహాదారు పోస్టులు అవసరమా?

06-11-2025 01:48:54 AM

  1. ఇప్పటికి ఏడుగురిని నియమించిన సర్కార్ 
  2. ఏడాదికి ప్రభుత్వంపై రూ.10 కోట్ల వరకు అదనపు భారం 

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వంలో అడ్వయిజర్ల సంఖ్య పెరిగిపోతున్నది. దీంతో ప్రభుత్వంపై అదనంగా భారం పడుతున్నది. మంత్రివర్గంలో చోటు కల్పించలేని వారికి, పార్టీలోని మరి కొందరు సీనియర్లకు ప్రభుత్వ సలహాదారు పదవులు పునరావాస కేంద్రంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సలహాదారు పదవులపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ హోదా కల్పిస్తూ సలహాదారు పదవులను కట్టబెట్టడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాం శం అవుతున్నది.

ప్రభుత్వ సలహాదారు పదవులతో సర్కార్‌కు పెద్దగా ఒరిగేదేమి లేకున్నా.. ప్రజలపై మాత్రం భారం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సలహాదారులకు మంత్రులకు ఇచ్చే జీతభత్యాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇవ్వాల్సి వస్తున్నది. ఒక్కో ప్రభుత్వ సలహాదారుకు నెలకు రూ. 3.50 లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. అదనంగా ప్రత్యేక ఆఫీసు, ఇద్దరు ప్రత్యేక అధికారులు, సిబ్బంది, ప్రోటోకాల్, వాహనాలు తదితర సౌకర్యాలతో కలిపి ఒక్కొక్కరిపై దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతున్నది.

మొన్నటివరకు ఆరుగురు ప్రభుత్వ సలహాదారులు ఉండగా, తాజాగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం తో ఆ సంఖ్య ఏడుకు చేరింది. ఇక సివిల్ సప్ల య్ కార్పోరేషన్ చైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నియమిస్తూ క్యాబినెట్ హోదా కల్పించిన విషయం తెలిసిందే. దీంతో క్యాబినెట్ హోదాతో కూడిన వారి సంఖ్య ఎనిమి దికి చేరింది. 

తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం సలహాదారులుగా కొనసాగుతున్న వారిలో వేం నరేం దర్‌రెడ్డి (సీఎం సలహాదారు), జితేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, కే కేశరావు, హర్కర వేణుగోపాల్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి ఉండగా, సివిల్ సప్లయ్ కార్పోరేషన్ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును నియ మిస్తూ క్యాబినెట్ హోదా కల్పించిన విషయం తెలిసిందే. ఎంపీ ఎన్నికల ముందు వరకు మల్లు రవి కూడా ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు. ఆ తర్వాత ఎంపీగా పోటీచేసి గెలవడంతో.. ఆ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది.

ప్రస్తుతమున్న సలహాదారుల్లో వేం నరేందర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండటం వల్లే ఆయనను సీఎం తన సలహాదారుగా నియమించుకున్నారు. ఇక  కే కేశవరావు బీఆర్‌ఎస్‌లో రాజ్యసభ్యుడిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎంపీ పదవిని వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరడంతో  ప్రభుత్వ సలహాదారు పోస్టును ప్రభుత్వం ఇచ్చింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడం వల్ల, ఆయన హోదాకు భంగం కలగకుండా ఉండాలని క్యాబినెట్ ర్యాంక్ కల్పిస్తూ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.

ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి కూడా సలహాదారు హోదాను కల్పిస్తూ ఢిల్లీలో ప్రతినిధిగా సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ గత అసెంబ్లీ  ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. కామారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పోటీ చేయడం వల్ల షబ్బీర్ అలీని నిజామాబాద్ టికెట్ ఇచ్చారు. అక్కడ ఓటమి చెందడంతో ముస్లిం మైనార్టీ చెందిన షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

పార్టీలో సీనియర్ నేతగా ఉన్న హర్కర వేణుగోపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం టికెట్‌ను ఆశించారు. ఆయనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ అధికారంలోకి రాగానే  ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. మరో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మంత్రి పదవిని ఆశించారు. మంత్రి పదవి ఇచ్చే అకాశం లేకపోవడంతో సివిల్ సప్లయ్ శాఖ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించి క్యాబినెట్ హోదాను కల్పించి సంతృప్తిపర్చారు.

సలహాదారుల్లో ఎస్సీ, ఎస్టీలకేది చోటు.. 

ప్రభుత్వ సలహాదారుల్లో ఓసీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం చోటు కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎస్సీ సామాజికవర్గం మల్లు రవిని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఎస్సీ సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వలేదనే అసంతృప్తి ఆ వర్గా ల నుంచి వ్యక్తమవుతోంది. ఇకపోతే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ సలహాదారులుగా నియమించలేదు. మంత్రివ ర్గంలో సీతక్క ఉన్నారు. లంబాడా సామాజిక వర్గం నుంచి కూడా అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.