06-11-2025 01:19:00 AM
నిత్యం చీమలబారులా బీజాపూర్-హైదరాబాద్ హైవే
నేతల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు
చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రజలు
సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న యువత, జనం
రంగారెడ్డి, నవంబర్ 5( విజయ క్రాంతి) రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డు మార్గాల్లో అదొకటి.. బాగా రద్దీగా ఉండే రూట్లలో ఇదొకటి. నిత్యం చీమల బారులా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అడుగుకో గుంత.. వాహనం అదుపుతప్పితే ప్రాణం పోయినట్లే. నేతలు హామీలు ఇచ్చినా.. ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు రూపు మాత్రం మారడం లేదు. చేవెళ్ల బస్సు ప్రమాదం నేపథ్యంలో మరోసారి వార్తల్లోకెక్కింది.
బీజాపూర్ - హైదరాబాద్ జాతీయ రహదారి మొత్తం మూలమలుపులు, ఇరుకైన రోడ్లు ప్రస్తుతం ప్రయాణికులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఉదయం, రాత్రి వేళలో ఈ రహదారి గుండా ప్రయాణాలు ప్రమాదాలకు పిలుపులుగా మారాయి. రయ్.. రయ్ అంటూ దూసుకుపోతున్న డంపర్లు, టిప్పర్లు, లారీల మోతకు ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగించడంతోపాటు పరిమితికి మించి తమ వాహనాల్లో టన్నుల కొద్ది లోడుతో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఈ రహదారంతా అడుక్కో గుంత మాదిరిగా ప్రమాదకరంగా మారింది. గత మూడు రోజుల క్రితం చేవెళ్ల సమీపం మిర్జాగూడ వద్ద రోడ్డుపైన గుంతను తప్పించబోయి అతివేగంతో కంకర టిప్పర్.. ఆర్టీసీని బస్సును ఢీ కొట్టిన ఘటనలో 19 ముందు ప్రయాణికులు మృతి చెందిన ఘటన అందరిని కలిచి వేస్తుంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డువిస్తరణ పనులు జాప్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వం... అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
గత 10 ఏళ్ల నుంచి బీజాపూర్ -హైదరాబాద్ రోడ్డు విస్తరణ మీదనే చేవెళ్ల రాజకీయం నడుస్తూ వస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని పలు ముఖ్యమైన జిల్లాలు, వికారాబాద్ నారాయణపేట జిల్లాల కు కొడంగల్, తాండూరు, పరిగి చేవెళ్ల నియోజకవర్గం మీదుగా వెళ్లే రహదారి ప్రధాన రోడ్డు కావడం గమనార్హం. వివిధ ప్రాంతాల ప్రజలంతా రాష్ట్ర రాజధానికి రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ రహదారి ప్రతినిత్యం చీమలదండులా వాహనాల బారులు కనిపిస్తూ ఉంటాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన రోడ్డు విస్తరణ కాకపోవడంతో ప్రతినిత్యం ప్రమాదాలు చోటుచేసుకుని వందలాది ప్రాణాలు పోవడంతో పాటు పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ఇదేమిటి చూడు ‘అప్పా’!
అప్పా జంక్షన్ నుంచి మోయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్ వరకు రహదారి అస్తవ్యస్తంగా మారింది. గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేసినా ఇటీవల కురిసిన వర్షాలకు బీటీరోడ్డు తేలి అధ్వానంగా మారింది. ప్రతినిత్యం ఈ రహదారి నుంచి రైతులు పండించిన పంటలు, కూరగాయలు, పూలు, పండ్లు, తాండూరు నుంచి సిమెంట్ ట్యాంకర్లు, బండలు, పెద్దేముల్ నుంచి సుద్ద, వికారాబాద్, మర్పల్లి, మోమిన్ పేట్, నవాబ్ పేట్ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ఎర్రమట్టి లారీలు రోజు రాకపోకలు సాగిస్తుంటాయి.
పరిమితికి మించి సరుకు రవాణా చేసినా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. తెలిసిన కూడా మామూళ్ల మత్తులో రవాణా శాఖ అధికారులు తూతూమంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఫోర్ లైన్ల రహదారి కోసం ఐదేళ్ల క్రితమే రూ.925 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే అయితే రోడ్డుకి ఇరువైపులా మర్రిచెట్ల తొలగింపు విషయంపై కొందరు పర్యావరణవేత్తలు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు దాఖలు చేయడంతో పనులకు బ్రేక్ పడింది.
గత పాలకులపై విమర్శలు....
గతంలో మంత్రులుగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మాజీఎంపీ రంజిత్ రెడ్డి, ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై ఉమ్మడి రంగారెడ్డి ప్రజలు ప్రస్తుతం గుర్రుగా ఉన్నారు. రోడ్డు విస్తరణ విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపడంలో విఫలం కావడంతోనే రోడ్డు ప్రమాదాలను బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత నాలుగు రోజుల నుంచి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలంతా రోడ్డు విస్తరణ చేపట్టాలంటూ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా గత పాలకుల తీరుపై విమర్శలు గుప్పిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. రోడ్డు ప్రమాదాల పైన చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు ఎక్కువ జరగుతాయని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పై ప్రజలు మండిపడుతున్నారు.
రోడ్డు సరిగా లేకపోతేనే యాక్సిడెంట్లు కావు బండ్లు నెమ్మదిగా వెళ్తాయి...రోడ్లు ఎంత మంచిగా ఉంటే అన్ని ప్రమాదాలు జరగుతాయని అయన కామెంట్ చేయడం పై ప్రజలంతా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరో పక్క చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన రోజే ఎమ్మెల్యే కాల యాదయ్య షాబాద్ లో అభివృద్ధి కార్యక్రమంలో జిమ్ ఓపెనింగ్ పాల్గొనడం పై ఆయనపై సైతం పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగి 19 మంది చనిపోతే స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి..
ప్రారంభోత్సవాలో ఎలా పాల్గొంటారని నియోజకవర్గ ప్రజలు పలు విమర్శలు చేస్తున్నారు. ఇది ఇది ప్రజల సమస్యలపై నేతలకు ఉన్న చిత్తశుద్ధి అంటూ పలు సామాజిక వేదికల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు మాత్రం మీ శవ రాజకీయాలు ఆపండి.. చిత్తశుద్ధితో ప్రజలు పడుతున్న బాధలను గుర్తించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలంటే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.