25-08-2025 01:03:05 AM
-జీఎం క్యాంప్ ఆఫీస్ కలేనా..
-ఫీజు వేయరు, బల్బు పెట్టరు
-కార్మిక కాలనీలపై శీత కన్ను
-అధికారుల పర్యవేక్షణ కరువు
-విద్యుత్తు సిబ్బంది విధులపై నిర్లక్ష్యం
బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 24: ఫ్యూజ్ పోయినా వేయరు. నచ్చితే ఒక తీరు నచ్చకపోతే మరోతీరు అన్నట్టు విద్యుత్ సిబ్బంది విధిధర్మాలు ఉంటాయి. వీధి దీపాలు ఏర్పాటులో నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. ఫ్యూజ్ పోయి, వీది దీపాలు వెలుగక చికట్లు కమ్ముకున్న పట్టించుకున్న నాథుడే లేడు.. నిజంగా కరెంటోళ్ళకి కనికరం ఉండదు కావ చ్చు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది ఎక్కడో కాదు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నెలకొన్న దుస్థితి. సింగరేణి కాలనీలపై ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులు, సిబ్బంది వ్యవహ రిస్తున్నతీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్మిక కాలనీలంటే వారికి ఎనలేని నిర్లక్ష్యం. ఈ అభిప్రాయం కార్మికులల్లో చిరకాలంగా సింగరేణి ఎలక్ట్రిసిటీ విభాగంపై బలంగా నాటుకు పోయింది. స్థానిక ప్రజలు, సింగరేణి కార్మికుల ఫిర్యాదులను అస్సలు ఖాతరు చేయరు. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కాలనీలకు పూర్వం నుంచి యాజమాన్యమే ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోం ది. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమంలో భాగంగా సింగరేణి కాలనీలకు తగిన సదుపాయాలు కల్పించారు. వైద్యం, విద్యుత్తు, తాగునీరు, పారిశుద్ధ్యం, క్వార్టర్ల మరమ్మతులు ఒకటేమిటి కార్మిక కుటుంబాలకు అవసరమైన సకల సంక్షేమ సదుపాయాల్ని యజమా న్యం అందించడం ప్రధాన విధి.
బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా ఉన్నంత కాలం బెల్లంపల్లిలో కార్మికులు ఏ లోటు లేకుండా అన్ని సదుపాయాలు పొందారు. బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి జిఎం, వర్క్ షాప్ టింబర్ యార్డ్, భూగర్భ నిక్షేపాల అన్వేషణ, మౌల్డింగ్, పవర్ హౌస్ ఇలా ప్రధాన రంగాలన్నీ ఉన్నప్పుడు యజమాన్యం బాధ్యతగా కార్మికులు, ఉద్యోగులకు సౌలభ్యాలు సమకూర్చుంది. ప్రధాన అధికారుల ఆఫీసులు, కార్మికుల పని విభాగాలు 2001 దశకం ముందే ఎత్తివేత, మూసివేతకు గురయ్యాయి. దానికి తోడు బెల్లంపల్లికి సంజీవని అయిన తొలితరం భూగర్భ గనులన్నీ ఒక్కటోక్కటిగా మూసివేతకు గురయ్యాయి. మార్గం ఫీట్, బోయపల్లి, సౌత్ క్రాస్ కట్, ఇంక్లున్ - 2, పవర్ హౌస్ వగైరా గనులు, డిపార్ట్మెంట్లన్నీ మూతపడ్డాయి.
పునర్విభజన బెల్లంపల్లికి శాపం..
అన్ని భూగర్భగనులు, డిపార్ట్మెంట్లు మూతబడి బెల్లంపల్లి జవసత్వాలు ఉడిగీ పోయాయి. బెల్లంపల్లి పరిధిలో శాంతిఖని బొగ్గు బావి మాత్రమే. చివరికి శాంతిఖని కి అనుబంధంగా బొగ్గు సరఫరాను చేసే సీఎస్పీని కూడా వదిలిపెట్టలేదు. మూసివేశారు. దీంతో బెల్లంపల్లి ఏరియా పరిధిలోనీ పట్టణాన్ని మంద మర్రిలో విలీనం చేశారు. ఏరియా ఆస్పత్రి, శాంతిఖని, సివిల్ డిపార్ట్మెంట్, సింగరేణి గృహ సముదాయ పర్యవేక్షణ బాధ్యతను మందమర్రి జీఎంకు అప్పగించారు.
ఆలనా పాలనా చూసే నాధుడేడీ..
ఏరియాలో పునర్విభజన అనంతరం బెల్లంపల్లి పట్టణం పై యజమాన్యం నిర్లక్ష్యం ఆవరించింది. బొగ్గు ఉత్పత్తిలో పట్టణ పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. ఒక శాంతిగని మాత్ర మే పట్టణంలో మిగిలిపోయింది. ఈ గని నుంచి బొగ్గు ఉత్పత్తి అంతంత మాత్రమే జరుగుతోంది. సంక్షేమాన్ని సేవారంగంగా చూడ కుండా యజమాన్యం లాభనష్టాలకోణంకి లంకె పెడుతూ వస్తుంది. యాజమాన్య దృక్పథంలో వచ్చిన వ్యాపార ధోరణి బెల్లంపల్లి పట్టణ వికాసానికి గుదిబడ్డయింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, పరిపాలన కార్మికులకు అందుబాటులో ఉంటే నే స్థానిక అధికారులు విధిగా చిత్తశుద్ధి తో పనిచేస్తారు. కార్మిక కుటుంబాల సమస్యలు ఎప్పటికప్పుడు ఇట్టే తీరిపోతాయి. ఇప్పటికైనా కార్మిక సంఘాలు అందులో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల లీడర్లు ఇకనైనా బెల్లంపల్లి పై దృష్టి పెట్టాలని కార్మికులు కోరుతున్నారు.