calender_icon.png 20 October, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఇళ్లే లక్ష్యమా!

20-10-2025 12:36:29 AM

ఆక్రమణల పేరిట బుల్డోజర్ల ప్రయోగం

ఇప్పటి వరకు ఒక్క పెద్దవ్యక్తి ఇల్లునా కూలిందా?

మంత్రులు, సీఎం సోదరుడి ఇళ్లు చెరువులో ఉన్నా ముట్టుకోరు

రాజేంద్రనగర్‌లో భూములున్నట్టు చూపిస్తే రాసి ఇస్తాం

సర్కార్ మోసాన్ని గుర్తెరిగి జూబ్లీహిల్స్‌లో ఓటెయ్యాలి

బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి) : ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతోందని.. అదే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇళ్లు చెరువుల్లో ఉన్నా ముట్టుకోవటం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. హైడ్రా వచ్చినప్పటి నుంచి ఒక్క పెద్ద వ్యక్తి ఇల్లునా కూలిందా? అని కేటీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

ఆదివారం రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నేతలు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.  మూసీకి అడ్డంగా కడుతున్న వారిని ఎవరూ పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించారు. గత దీపావళికి మంత్రి బాంబులేటి బాం బులు పేలుతాయన్నారని, మళ్లీ దీపావళి వచ్చినా బాంబులు ఇంకా పేలనేలేదని ఎద్దేవా చేశారు. 

ఉప ఎన్నిక.. ప్రభుత్వ విశ్వనీయతకు పరీక్ష

నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పాలన, శాంతిభద్రతలు, ప్రభుత్వ విశ్వసనీ యతకు పరీక్షగా నిలుస్తుందన్నారు. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయో గపడే పెద్ద ప్రాజెక్టులను నిలిపివేస్తూ, ప్రజలపై బుల్డోజర్లను ప్రయోగించిందని ఆరోపించా రు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాటకాలను నమ్మకుండా, 420 గ్యారంటీల పేరుతో చేసిన మోసాన్ని గుర్తుంచుకొని ఓటు వేయాలన్నారు.

దొంగ పోరాటం వద్దు.. 

బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీకి, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, వారి ఎంపీలు తెలంగాణ గల్లీలో దొంగ పోరాటం చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేలా ప్రయత్నం చేయాలని సూచించారు. బీసీలను మోసం చేసే ఉద్దేశంతోనే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో నాటకాలు ఆడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్‌లు బీసీల 42 శాతం రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని, తమకు ఉన్న రాజ్యసభ ఎంపీల ద్వారా పార్లమెంటులో పూర్తి మద్దతు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. 

క్యాబినెట్ మంత్రుల కొట్లాట... 

కేవలం మేడారం జాతర పనుల వివాదాల గురించి మాత్రమే కాకుండా టెండర్ల నుంచి మొదలుకొని బిల్లుల విడుదల వరకు ప్రతి సందర్భంలోనూ కమిషన్ల కోసమే కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులు కొట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.  ప్రజల కోసం పనిచేయాల్సిన క్యాబినెట్ సమావేశంలో కమిషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటూ, దాన్ని వాటాల కోసం మంత్రులు కొట్లాడుతుంటే తెలంగాణ పరిపాలన ఎవరు చేస్తారని, పట్టించుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ వే, మెట్రో రెండవ దశ ప్రణాళికలను పూర్తిగా పక్కన పెట్టి, హైదరాబాద్ నగర అభివృద్ధి పైన నీళ్లు చల్లారని కేటీఆర్ విమర్శించారు. ప్రజాహితం విస్మరించి భవిష్యత్ లేని ఫ్యూచర్ సిటీ వైపు అడ్డగోలు సొమ్మును ఖర్చు పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఫ్యూచర్ సిటీలో ఉన్న తమ భూములకు మరింత రేటు వచ్చేలా పాటుపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదటి దిద్దుబాటు చర్య కావాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.