calender_icon.png 26 December, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ రిజిస్ట్రేషన్ శాఖలో గుట్టుగా అక్రమ రిజిస్ట్రేషన్లు..

26-12-2025 12:00:00 AM

  1. రైటర్లదే హవా..వారు చెప్పిందే వేదం.. 

సంతకం పెట్టు..అంటే పెట్టే అధికారులు..

నష్టపోతున్న సామాన్యులు.. లాభపడుతున్న రైటర్‌లు 

బయటపడుతున్న రైటర్ల లీలలు.. అందుకు అధికారుల వత్తాసు..

ఏసీబీ అధికారులను ఆశ్రయించనున్న బాధితులు..

బాన్సువాడ వైపు కన్నెత్తి చూడని... ఏసీబీ అధికారులు..

బాన్సువాడ, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): బాన్సువాడ రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రైటర్లు చెప్పిందే విధంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి పనిని పూర్తి చేసి పెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో పనిచేసే ఓ రైటర్ కార్యాలయంలో తానే అన్ని అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

సదరు రైటర్ అనుసరిస్తున్న వ్యవహారంతో సామాన్య బాధితులు ఇబ్బందులు గురవుతున్నారన్న చర్చ జరుగుతోంది. బాన్సువాడ ప్రధాన రహదారి పోలీస్ కిష్టయ్య విగ్రహం పక్కన ఆనుకొని ఉన్న పక్కా నిర్మాణాన్ని నామమాత్రంగా డిస్మెంటల్ చేసి అట్టి ప్రాంతాన్ని ఖాళీ స్థలంగా చూపించి ఓ రైటర్ రిజిస్ట్రేషన్ కు దారి సుగుమం చేసినట్లు తెలిసింది. బోధన్ ప్రాంతంలో బాండ్ పేపర్ను కొనుగోలు చేసి, బాన్సువాడ లో రిజిస్ట్రేషన్ జరిగినట్లు అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

డాక్యుమెంటరీ పత్రాలలో బోధన్ సబ్ రిజిస్టర్ స్టాంప్ తో కూడిన పత్రాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాన్సువాడకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ను బాన్సువాడలో జరిపించుకునే విధంగా అవకాశం ఉన్నప్పటికీ, ఇట్టి ప్రక్రియకు బోధన్ లో జరిగిన తథాంగంపై మతలబు ఏమిటా నన్న సంశయం కూడా ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్స్ తంతు పూర్తయినప్పటికీ, ఖాళీ స్థలాన్ని చూపించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వ్యక్తులు పక్కా గోడలపైనే తిరిగి పనులను చేపట్టడం కూడా అనుమానం కలుగుతుంది.

ఈ విషయంలో ఓ వ్యక్తి స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పనులను సదరు మున్సిపల్ అధికారులు నిలిపివేశారు. కాగా, ఈ విషయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందన్న అంశంపై ఆరోపణలు వెల్లువెత్తువడమే కాకుండా ఇది నిజంగా జరిగిందా.. అనే కోణంలో ఉన్నత అధికారులు సైతం దృష్టి సారించినట్లు సమాచారం. ఈ విషయం కూడా పూర్తి సమాచారం ఏసీబీ దృష్టికి పోయినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై పూర్తి వివరాల కోసం ప్రయత్నం జరుగుతుంది. 

రిజిస్ట్రేషన్ శాఖలో...గందరగోళం..

 బాన్సువాడ రిజిస్ట్రేషన్ శాఖలో పట్టాల మార్పిడిలో గందరగోళం నెలకొంటుందన్న వాదన బహిరంగ మార్కెట్లో వినిపిస్తుంది.పట్టాల మార్పిడిలో పైకం దారుల హవా కొనసాగుతోందన్న విమర్శ తలెత్తుతుంది. పైకం కొట్టు రిజిస్ట్రేషన్ పట్టుమనే పద్ధతి నెలకొంది. ప్రతి పనికి రైటర్ల నుండి మొదలుకొని రిజిస్ట్రేషన్ అధికారి వరకు మామూలు దండుకుంటున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి.

వీరి తీరు అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టి వరకు వెళ్ళినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. బాన్సువాడ ప్రధాన రహదారికి పక్కనే ఉన్న పక్కా భవనాన్ని నామమాత్రంగా కూల్చివేసి ఖాళీ స్థలంగా చూపించి రిజిస్ట్రేషన్ చేయడంపై పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు విమర్శ గుప్పుమంటుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అమ్యమ్యాలపై ఏసీబీ అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్తూనే వస్తున్నారు.

ఇటీవలనే ఇటీవలనే  నిజామాబాద్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో సోదాలు చేపట్టడం తెలిసిందే. అదే కోవలో  కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని నెల రోజుల క్రితం పలువురు బాధితుల సమాచారం మేరకు ఏసీబీ అధికారులు ఇందూరు రిజిస్ట్రేషన్ శాఖలో తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ నిర్వహణ, సిబ్బంది అధికారుల పనితీరుపై దృష్టి పెట్టారు. ఆకస్మికంగా జరిపిన ఏసిబి సోదాలతో అధికారులు సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

ఇటీవల ఏసీబీ అధికారులు పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ శాఖలపై దృష్టి పెట్టి అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటనలు విధితమే. తాజాగా ఏసీబీ రిజిస్ట్రేషన్ శాఖలపై కన్నేసింది. భూములు, ప్లాట్లు క్రయవిక్రయాల విషయంలో పట్టాల మార్పిడి రిజిస్ట్రేషన్లలో రైటర్లను అడ్డుగా పెట్టుకొని అధికారులు తమ పనిని ముగించుకుంటున్నారు. అవసరమైతే పైకం మాయలో పడి నిబంధనలను సైతం సడలిస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

ముడుపులు చెల్లించు... పట్టా పట్టు...

రిజిస్ట్రేషన్ శాఖలో పట్టాల మార్పిడిని బట్టి ముడుపులు దండుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రతి పనికి సంబంధించి పనిని పూర్తి చేసే విషయంలో పైకం దండుకుండే విషయంలో అధికారులు మధ్యవర్తలను ఆశ్రయిస్తున్నారు. గతంలో వర్ని మండల కేంద్రంలో మామూలు దండుకొని పట్టాను మార్చిన విషయంలో బాధితుడు పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేసే పరిస్థితికి చేరుకుంది. బోధన్ రిజిస్ట్రేషన్ శాఖలో రైటర్లు చెప్పిందే తడువుగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పట్టాల మార్పిడికి పూను కుంటున్నట్లు సమచారం .

గత నెల రోజు క్రితం బోధన్ పట్టణం గౌడ్స్ కాలనీకి సంబంధించి పట్టా మార్పిడి విషయంలో అక్రమఅదేవిధంగా రిజిస్ట్రేషన్ పూనుకొని 1,50,000 సమీప హోటల్లో మధ్యవర్తుల ద్వారా సదరు అధికారి తీసుకున్నట్లు విశ్వాస నియా వర్గాల సమాచారం. అదేవిధంగా బాన్సువాడ పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న దుకాణ సముదాయాల విషయంలో స్థానిక రిజిస్ట్రేషన్ అధికారులు పెద్ద మొత్తంలో పైకం తీసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎల్లారెడ్డిలో పొలం రిజిస్ట్రేషన్ సంబంధించి ఓ సామాన్య రైతు నుండి లక్ష రూపాయలను డిమాండ్ చేసి 70 వేల రూపాయలు నగదు తీసుకున్నట్లు సమాచారం.

డబ్బులు ముట్ట నీదే రిజిస్ట్రేషన్ కాదని సాకు పెట్టి అధికారులు డబ్బులు తీసుకున్న తర్వాతనే నిబంధనలను బేకాతార్ చేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. బిచ్కుంద రిజిస్ట్రేషన్ శాఖలో కూడా హైవే రోడ్డుపై ఉన్న రెండు షెటర్ల క్రయవిక్రయాల్లో కొనసాగిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సదరు  అధికారి 40 వేల రూపాయలను బాన్సువాడ తాడుకోల్ చౌరస్తాలో స్వీకరించినట్లు సమాచారం.

ఇలా రిజిస్ట్రేషన్ శాఖ ప్రతి పనికి పైకం తీసుకుని అలవాటు చేసుకోవడం సామాన్యులకు భారంగా మారుతుంది. అవినీతి నిరోధించేందుకు ఏసీబీ శాఖ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రం చర్యకు భయం ఏమాత్రం కనిపించడం లేదు. 

రిజిస్ట్రేషన్ లో అంతా... రైటర్ లే...

ప్రభుత్వ రిజిస్ట్రేషన్  శాఖలో అసైన్డ్  భూములను సైతం అధికారులు డబ్బులు తీసుకుని దొడ్డి దారిన పట్టాలను చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విషయంలో ఏమాత్రం లోటుపాట్లు ఉన్న రైటర్ల ద్వారా సంప్రదింపులు జరిపి ఒప్పందం కుదిరిన వెంటనే పేర్ల మార్పిడి విషయంలో అధికారులు  తగు శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. బాన్సువాడ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఓ రైటర్ తానే రిజిస్ట్రేషన్ శాఖ అధికారిగా చలామణి అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారుల తో పాటు, భూములు ప్లాట్లు కొనే  మధ్యవర్తుల వరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అసలైన క్రయవిక్రయదారుల నుండి సమాచారాన్ని స్వీకరించకుండా రైటర్లు చెప్పిందే విధంగా పట్టాలను మార్చేస్తున్నట్లు అపవాదు ఉంది. బాన్సువాడ నియోజకవర్గం లో బుడిమి, తాడుకోలు మధ్య ప్రాంతంలో ఉన్న ఒక భూమి రిజిస్ట్రేషన్ విషయమై అక్రమ రిజిస్ట్రేషన్లకు పూనుకున్నట్లు వదంతులున్నాయి. ఈ విషయంలో  ఓ రైటర్ కీలక పాత్ర పోషించి అన్ని తానే ఈ వ్యవహారాన్ని నడిపినట్లు సమాచారం.

సదరు రైటర్ చెప్పిందే విధంగా బాన్సువాడ రిజిస్ట్రేషన్ శాఖలో సిబ్బంది నుండి మొదలుకొని అధికారి వరకు తలాడించి పనిచేసే పరిస్థితి నెలకొంది. బాన్సువాడ పట్టణంలో రోడ్డు వెడల్పు లో భాగంగా ఇరువైపులా కూలిపోయిన భవనాల స్థలాలను కొందరికి పైకం పుచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. 

ఏసీబీ సార్లు..జర ఇటు చూడరు...

గత కొన్ని రోజులుగా అవినీతి అరికట్టేందుకు ఏసీబీ అధికారులు చాకచక్యంగా వ్య వరిస్తున్నారు. ప్రజలకు నిత్యం సేవలందించే శాఖల పై దృష్టి పెట్టి పక్కా బాధితుల సమాచారం వరకు దాడులు నిర్వహించి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్న సంఘటనలు పక్షం రోజుల నుండి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వేడి వాడి వాతావరణం లో ఏసీబీ  అధికారులు యూటర్న్ తీసుకొని తమ నేత్రాలను రిజిస్ట్రేషన్ శాఖపై స్పందించారు.

ఏసీబీ పెట్టిన నిఘానేత్రంలో పలు అధికారులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పట్టాల మార్పిడి, ఎల్లార్ పేమెంట్ విషయంలో రైటర్లు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మిలాకతై పనులను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ప్రతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో క్రయ విక్రయ ఇరువర్గాల నుండి అందినంత దోచుకోవడం అధికారులకు అంతో ఇంతో  ఇవ్వడం ఈజీగా అలవాటైపోయింది. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి తతంగాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి నిలిపి సామాన్యులకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.