calender_icon.png 26 December, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తి.. తీరేనా దాహార్తి!

26-12-2025 01:17:45 AM

  1. గ్రామాల్లో పడకేసిన మిషన్ భగీరథ పథకం
  2. తాగునీటి కోసం తంటాలు పడుతున్న ప్రజలు
  3. మూలనపడ్డ బోర్లు, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న నూతన సర్పంచ్‌లు
  4. గ్రామ పంచాయతీలకు అత్యవసర నిధులు కేటాయించాలని వేడుకోలు

తుంగతుర్తి, డిసెంబర్ 25 (విజయక్రాంతి): గడిచిన రెండు నెలలుగా తుంగ తుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పథకము పడకేయడంతో.. గ్రామాల్లో మంచినీటి కొరతతో ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తుంగతుర్తితో పాటు ఇతర మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి ఎద్దడి తలెత్తింది. గత పాలకుల హయాంలో మిషన్ భగీరథ పథకానికి ప్రత్యేకత కల్పించి వీధుల్లో ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేయించారు. కాలక్రమేనా నీటిని తోడే భారీ స్థాయి మోటర్ పంపులు పనిచేయకపోవడంతో, ప్రస్తుతం తీవ్ర ఇబ్బందిగా మారింది.

గత కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా ఉన్న బోర్లు వాడకపోవడంతో అవికాస్త పనిచేయకుండా పోయాయి. దీంతో గ్రామాలలో ప్రస్తుతం తాగునీటి కొరత దాపురించింది. గతంలో రాష్ట్రం నుండి గ్రామపంచాయతీలకు ఆడపదడపా నిధులు మంజూరు అయ్యేవి. గ్రామ పంచాయతీల ఎన్నికలు రెండు సంవత్సరాలు జరపకపోవడంతో కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి సైతం నిధులు రాకపోవడంతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది. దీంతో ఇన్నాళ్లు గ్రామ పంచాయతీల ద్వారా ఏ పనులు చేపట్టకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక గ్రామాలలో తాగునీటి పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారైందనడంలో సందేహం లేదు.                            

ఇబ్బందులు తొలగించే ప్రయత్నంలో నూతన సర్పంచ్‌లు                           

ఈనెల 22 నుండి బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచులు గ్రామాలలో మౌలిక వసంతల కల్పనకు తమ వంతు కృషి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నెలకొన్న తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు సొంత నిధులతో పనులు చేపడుతున్నారు. పలు గ్రామాలలో సర్పంచులు తమ సొంత ఖర్చులతో నీటి ట్యాంకులు పెట్టించి గ్రామాల్లోని వీధుల వారిగా మంచినీటిని పంపిణీ చేయిస్తున్నారు.

గతంలో గ్రామాల్లో నడిచిన బోర్లను తక్షణమే మరమత్తులు చేయించి అసలు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అలాగే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు మిషన్ భగీరథ మోటార్ బోర్ల పరిస్థితినీ ప్రత్యక్షంగా పరిశీలించి ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియపరచి ప్రత్యేక నిధులతో మరమ్మత్తులు చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు మంచినీటి సరఫరా నిమిత్తం ప్రత్యేక నిధులు కేటాయించాలని సర్పంచులు, ప్రజలు కోరుతున్నారు.

గ్రామాల్లో మంచినీటి ఎద్దడిని తక్షణమే నివారించాలి 

గత కొంతకాలంగా మిషన్ భగీరథ మంచినీటి సరఫరా కాకపోవడంతో, ప్రతినిత్యం బోరు వద్దకు వెళ్లి బైకులపై నీటిని తెచ్చుకుంటున్నాం. ప్రస్తుతం చాలా ఇబ్బందిగా మారింది. ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, పూర్తి స్థాయిలో అందరికి సరఫరా జరగడం లేదు. గ్రామంలో ఉన్న పాత బోర్లను రిపేర్ చేయించి మంచినీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి.

- కటకం వెంకటేశ్వర్లు, తుంగతుర్తి

మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి

గత కొంతకాలంగా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఉన్నది వాస్తవమే. మిషన్ భగీరథ పైప్ లైన్ లో సమస్యలు తలెత్తడంతో పూర్తిస్థాయిలో సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటికి ప్రస్తుతం ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. వీధుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాము. మిషన్ భగీరథ పైపులైన్లకు మరమ్మత్తులు చేయడంతోపాటు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. అప్పుడే మౌలిక వసతుల కల్పన చేయగలుగుతాం.

 మల్లెపాక సాయిబాబ, సర్పంచ్, తుంగతుర్తి