calender_icon.png 26 December, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వితీయశ్రేణి నేతల ఆశలు గల్లంతు!

26-12-2025 02:05:57 AM

  1. మున్సిపాలిటీలలో గ్రామాల విలీనంతో కనుమరుగైన కిందిస్థాయి పదవులు 
  2. జీహెచ్‌ఎంసీలో విలీనంతో పట్టణాల్లోనూ అదే పరిస్థితి
  3. స్థానిక నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోవడమే! 
  4. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు 

మేడ్చల్, డిసెంబర్ 25(విజయ క్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను రింగ్ రోడ్డు వరకు విస్తరించడంతో అనేకమంది ద్వితీయ శ్రేణి నాయకుల ఆశలు గల్లంతయ్యాయి. ఈ నిర్ణయంతో వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. పోటీ చేయాలనుకుంటే కార్పొరేటర్ లేదంటే చట్టసభలకే అన్నట్లు తయారయింది. మేడ్చల్ జిల్లాను అర్బన్ జిల్లాగా మార్చడంతో సుమారు 1000 పదవులు గల్లంతయ్యాయి.

జిల్లాలో గతంలో సగం జిహెచ్‌ఎంసి పరిధిలో ఉండగా, మిగతా సగం లో 61 గ్రామపంచాయతీలు, ఐదు మండలాలు, 9 పురపాలక సంఘాలు, నాలుగు కార్పొరేషన్లు ఉండేవి. గ్రామపంచాయతీలలో సర్పంచ్, ఉప సర్పంచ్ జనాభా ఆధారంగా 8 నుంచి 14 మంది వార్డ్ మెంబర్లు ఉండేవారు. మండల పరిషత్లకు ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ, ఐదుగురు జడ్పిటిసి సభ్యులు, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఉండేవారు. ప్రస్తుతం ఈ పదవులేమీ లేవు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండేవారు.

మున్సిపాలిటీలతోపాటు జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులలో కోఆప్షన్ సభ్యులు ఉండేవారు. మున్సిపాలిటీలలో గతంలో 20 నుంచి 30 మంది కౌన్సిలర్లు ఉండగా, ప్రస్తుతం ఒక పదవికి తగ్గిపోయింది. ఉదాహరణకు మేడ్చల్ మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండేవి. 23 వార్డుల నుంచి ప్రజా ప్రతినిధులు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండు డివిజన్లు మాత్ర మే ఏర్పాటు చేశారు. కొన్ని మున్సిపాలిటీలలో ఒక్క డివిజన్ మాత్రమే ఏర్పాటు చేశా రు. దీనిని బట్టి ఎన్ని పదవులు తగ్గాయో అర్థమవుతుంది. మేడ్చల్ జిల్లాలో  ప్రస్తుతం 25 డివిజన్లు మాత్రమే ఏర్పాటయ్యాయి.

ద్వితీయశ్రేణి నాయకులు పదవులకు దూరం 

ద్వితీయ శ్రేణి నాయకులు పదవులకు దూరమయ్యారు. ఎప్పటికీ వీరు పెద్ద నాయకుల కోసమే పనిచేయాల్సి ఉంటుంది. వీరికి నామినేటెడ్ పదవులు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జిల్లాలో మార్కెట్, దేవాలయ కమిటీలు ఎక్కువగా లేవు. 

రూ. కోట్లు ఉన్న వారికే పదవులు 

గతంలో చిన్నపాటి ఖర్చుతో పెదవులు లభించేవి. గ్రామాల్లో, ము న్సిపల్ వార్డులలో మంచి పేరు ఉన్న, సేవ గుణం ఉన్న పదవులు లభించేది. ప్రస్తుతం వీరికి ఎలాంటి పదవులు వచ్చే అవకాశం లేదు. జిహెచ్‌ఎంసిలో కార్పొ రేటర్ కావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. డబ్బున్న వారికే పదవులు వచ్చే అవకాశం ఉం టుంది. కార్పొరేటర్ కావాలంటే కనీసం ఐదు కోట్లు ఖర్చు చేయాలి. 

జిహెచ్‌ఎంసిలో విలీనంతో అయోమయం 

జిహెచ్‌ఎంసిలో విలీనంతో గ్రామాల లో పట్టణాలలో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఏ ఉద్దేశంతో జిహెచ్‌ఎంసి లో విలీ నం చేశారో స్పష్టత లేదు. విలీనం చేసేముందు కనీసం అభిప్రాయ సేకరణ కూడా చేయలేదు. ప్రభుత్వం ఏకపక్షంగా విలీనం చేసింది. విలీనం చేసిన వార్డుల డీలిమిటేషన్ కూడా గందరగోళంగా ఉంది. అధికారులు ఇష్టానుసారంగా డిలిమిటేషన్ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తో ఈ అంశం కోర్టు వరకు వెళ్ళింది. 

ఆ మూడు మున్సిపాలిటీలు సైతం త్వరలో విలీనం 

మేడ్చల్ జిల్లాలో రింగ్ రోడ్డు బయట మూడు మున్సిపాలిటీలు మాత్రమే మిగిలాయి. వాస్తవానికి ఈ మున్సిపాలిటీలలోని గ్రామాలన్నీ ఆరు నెలల క్రితం వరకు పంచాయతీలుగా కొనసాగాయి. పంచాయతీలను నేరుగా జిహెచ్‌ఎంసి లో విలీనం చేయడానికి వీలు లేదు. అలా చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. అందుకే తాత్కాలికంగా మూడు కొత్త మున్సిపాలిటీలు ఎల్లం పేట, అలియాబాద్, మూడు చింతలపల్లి ఏర్పాటు చేశారు. ఎన్నికల వరకు జిహెచ్‌ఎంసి లో విలీనం చేసే అవకాశం ఉంది. 

మూడు కార్పొరేషన్లుగా జిహెచ్‌ఎంసి? 

జిహెచ్‌ఎంసిలో 300 డివిజన్లు డీలిమిటేషన్ చేసినప్పటికీ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మేడ్చల్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన డివిజన్లతో పాటు సికింద్రాబాద్ తో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 70, 80 డివిజన్లతో పాటు మరికొన్ని కొత్తగా ఏర్పాటు చేసి  కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది 

నాయకుల తీరుపై తీవ్ర నిరసన 

కాంగ్రెస్ నాయకుల తీరుపై అన్ని పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిహెచ్‌ఎంసిని రింగురోడ్డు వరకు విస్తరించి మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలను విలీనం చేయాలని గతంలో వినతిపత్రం సమర్పించారు. ఐదేళ్ల తర్వాత విలీనం చేస్తే బాగుండేదని, ఇప్పుడే తొందర ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

ఇద్దరు నాయకులు తమ కుమారులకు అనుకూలంగా ఉండడానికి డివిజన్లు ఏర్పాటు చేయించుకున్నారు. పెద్ద నాయకులు కుమారుల కోసం అనుకూలంగా డివిజన్ ఏర్పాటు చేసుకొని రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారని, తమ రాజకీయ భవిష్యత్తును అంధ కారంలో నెట్టివేశారని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు.