calender_icon.png 21 July, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీనివాస్ కు ఏరియా స్టోర్స్ ఉద్యోగుల నివాళులు

21-07-2025 06:25:24 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని ఏరియా స్టోర్స్ లో జనరల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కొత్తపల్లి శ్రీనివాస్ కు ఏరియా స్టోర్స్ ఉద్యోగులు ఘనంగా నివాళులు అర్పించారు. ఏరియా స్టోర్స్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పిస్తూ, ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డిజిఎం ఎస్ఈ(ఈఅండ్ఎం), స్టోర్స్ ఇంచార్జ్ ఎస్ సురేష్ మాట్లాడుతూ, కొత్తపల్లి శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరమని తెలిపారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సింగరేణి యాజమాన్యం, ఏరియా స్టోర్స్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అధికారుల నిర్లక్ష్యం మూలంగానే శ్రీనివాస్ మృతి చెందాడని ప్రచారం జరగడం బాధను కలిగించిందని, అది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. మే 6న ఏరియా స్టోర్స్ లో మృతునిపై తేనెటీగలు దాడిచేయగా ఎవరికి చెప్పకుండా కేకే 1 డిస్పెన్సర్ కి చికిత్సకి వెళ్లగా, వైద్య పరీక్షల్లో అతనికి బిపి అధికంగా ఉండటంతో వైద్యులు ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని తెలుపగా, అక్కడి నుండి ఎవరికి తెలుపకుండా మృతుడు స్టోర్స్ కు తిరిగి వచ్చాడని, ఆసుపత్రి సిబ్బంది ఏరియా స్టోర్స్ కు ఫోన్ చేసి, విషయం తెలపడంతో వెంటనే ఆరోగ్యం మంచిగా చూసుకోవాల్సిందిగా సూచిస్తూ, ఒక అటెండర్ ను ఇచ్చి, తిరిగి ఆసుపత్రికి పంపించడం జరిగిందని, ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, వారి కుటుంబ సభ్యులకు విషయం తెలియ జేయడం జరిగిందన్నారు.

రెండు రోజుల అనంతరం ఆసుపత్రి నుండి ఫిట్ తీసుకొని వచ్చి, తిరిగి విధుల్లో చేరాడని, కొద్దిరోజులు విధులు నిర్వహించిన అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించి, బ్రెయిన్ స్ట్రోక్ గురై ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి, వైద్య చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఈ విషయంపై నిజా నిజాలు తెలుసుకోకుండా స్టోర్స్ అధికారులు నిర్లక్ష్యం మూలంగానే శ్రీనివాస్ మృతి చెందాడని వదంతులు సృష్టించారని, తమ తోటి సన్నిహితుని కోల్పోయిన తమకు ఈ వార్త మరింత తీవ్ర భాదను కలిగించిందన్నారు.

మృతుని కుటుంబానికి సింగరేణి యాజమాన్యం, ఏరియా స్టోర్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సహ ఉద్యోగి అక్తర్ పాషా మాట్లాడుతూ, ఆరోజు శ్రీనివాస్ తమతో పాటు పనిచేస్తున్న క్రమంలో ఆసుపత్రి నుండి ఫోన్ రావడంతో అక్కడే ఉన్న అధికారి సురేష్, శ్రీనివాస్ కు అతని ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా వివరించి, చికిత్స చేయించుకుని రావాల్సిందిగా సూచిస్తూ, తనను అతనికి తోడుగా ఆసుపత్రికి పంపించారని,  శ్రీనివాస్ ను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, వారి కుటుంబసభ్యులకు విషయం తెలిపి, తిరిగి విధులకు హాజరయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో స్టోర్స్ ఉద్యోగులు పాల్గొన్నారు.