21-07-2025 11:22:07 PM
బీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి..
హుజూర్ నగర్/నేరేడుచర్ల: స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి(BRS Party Constituency Coordinator Onteddu Narasimha Reddy) అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కి ఆరు హామీల్లో ఒక్క దానిని కూడా నెరవేర్చకపోగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చే విధంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ అప్పు పుడత లేదంటూ, చేతులెత్తేశారన్నారు.
రైతు భరోసా, రైతు బీమా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, బోనస్, గ్యాస్ సిలిండర్లు, నెలకు మహిళలకు 2500 రూపాయల నగదు, ఆసరా, వికలాంగుల పెన్షన్ల పెంపు లాంటి హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చక పోగా వాటి అమలుకై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ సత్తాను తెలంగాణలో చాటాలని సూచించారు. నీటి వాటాలు, బనకచర్ల వివాదంపై సీఎం రేవంత్ గురువైన చంద్రబాబుకి మేలు చేకూర్చే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో తిరిగి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్నారు. బీసీ రిజర్వేషన్ పేరిట రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం చేసేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నాడని, నిజానికి కేసీఆర్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని, దీంతో రాష్ట్రంలోని బీసీలంతా కేసిఆర్ పక్షాన్ని నిలబడతారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ మార్కెట్ ఛైర్మెన్ నాగండ్ల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి యల్లబోయిన లింగయ్య యాదవ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ చందమల్ల జయబాబు, అన్నపురెడ్డి నారాయణరెడ్డి, అనంతు శ్రీనివాస్ గౌడ్, వస్కుల సుదర్శన్,చిత్తలూరి సైదులు, రాపోలు నవీన్ కుమార్, నందిపాటి గురవయ్య, కనకరాజుల రాంబాబు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.