calender_icon.png 5 August, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రోటోకాల్ పై వాగ్వాదం

04-08-2025 11:16:01 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం..

సిద్దిపేట: సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్ ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం లేకపోవడంపై ఆ పార్టీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని తీసుకొచ్చి చైర్ పర్సన్ ఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కాంగ్రెస్ కౌన్సిలర్లు సాకి బాల్ లక్ష్మీ ఆనంద్, రియాజ్, పయ్యావుల పూర్ణిమ ఎల్లం యాదవ్, అలకుంట్ల కవిత, ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి ల మధ్య వాగ్వాదం జరిగింది.

సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు నిధులు తీసుకురావాలని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల కాంగ్రెస్ కౌన్సిలర్లు కు సూచించారు. ఇందుకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దీటుగా స్పందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అన్ని వార్డుల్లో సమానంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తోందన్నారు. సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్ల పట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లు అగౌరవంగా వ్యవహరించారని ఆరోపించారు. చేతకాకపోతే.. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఆధారాలు చూపితే చర్యలు

 సిద్దిపేట మున్సిపల్ కౌన్సిల్ పై నిరాధార ఆరోపణలు సరికాదని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు అన్నారు. సోమవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో ఆమె మాట్లాదారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో సిద్దిపేట పట్టణం అభివృద్ధి పథంలో కొనసాగుతోందన్నారు. మున్సిపల్ కమిషనర్ గా ఆశ్రిత్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పురపాలక సంఘం ఆదాయం సుమారు రూ.5 కోట్లు పెరిగిందన్నారు. అభివృద్ధి పనులకు గాను గత మున్సిపల్ కమిషనర్ రూ.కోటి 19 లక్షలకు సంబంధించి 54 చెక్కులు, అదేవిధంగా ప్రస్తుత కమిషనర్ రూ.60 లక్షల చెక్కులు జారీ చేశారని స్పష్టం చేశారు.

మున్సిపాలిటీ పరిధిలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు చూపితే సీడీఎంఏ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలకు సహకరిస్తామని కాంగ్రెస్ కౌన్సిలర్లకు  సూచించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్, నాయకుడు చేసిన ఆరోపణల విషయాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ జిల్లా, పట్టణ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మాజీ కౌన్సిలర్ ఒకరు తన  ఇంటి నెంబర్ ను అప్పటి అధికారుల సహకారంతో ఆన్లైన్ నుంచి తొలగించినట్లు దృష్టికి వచ్చిందన్నారు. మున్సిపల్ ఆవరణలో త్వరలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫిర్యాదుల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.