06-01-2026 12:22:48 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5, (విజయక్రాంతి): సీఎం కప్ క్రీడా పోటీలను జిల్లాలో విజయవంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణపై క్లస్టర్ ఇన్చార్జిలు , ఎంఈఓ లు , డీఈవో , డిపిఓ సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడమే సీఎం కప్ క్రీడా పోటీల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
సీఎం కప్ క్రీడా పోటీలు ఐదు దశలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ స్థాయి పోటీలు ఈ నెల 17 నుండి 22 వరకు, మండల స్థాయి పోటీలు ఈ నెల 28 నుండి 31 వరకు, నియోజకవర్గ స్థాయి పోటీలు ఫిబ్రవరి 3 నుండి 7 వరకు, జిల్లా స్థాయి పోటీలు ఫిబ్రవరి 10 నుండి 14 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నాలుగు దశల పోటీల్లో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొనే అర్హత పొందుతారని చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఫిబ్రవరి 19 నుండి 26 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామస్థాయి లో సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణ కోసం జిల్లాను 77 క్లస్టర్లుగా విభజించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
గ్రామీణ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పోటీలు సక్రమంగా నిర్వహించేందుకు ఎంఈఓలు, సీఆర్పీలు, పంచాయతీ సెక్రటరీలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని క్రీడలను విజయవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడలతో పాటు ఫుట్బాల్ పోటీలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా స్థాయిలో వివిధ రకాలైన మొత్తం 21 క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
గ్రామీణ ప్రాంతాలలో సీఎం కప్ క్రీడా పోటీలపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని, క్రీడల్లో పాల్గొనదలచిన వారు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేలా అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులు తమ వివరాలను అధికారిక వ్బుసైట్ (satg.telangana.gov.in/ cmcup) లేదా ‘CM Cup’ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి ప్రభుత్వం సర్టిఫికేట్లు అందజేస్తుందని అన్నారు. పోటీల నిర్వహణకు అవసరమైన మైదానాలను సిద్ధం చేయాలని, ప్రతి గ్రామంలో కనీసం రెండు మైదానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక మైదానాన్ని బాలుర పోటీలకు, మరో మైదానాన్ని బాలికల పోటీలకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గ్రామ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు మండల స్థాయికి, మండల స్థాయి నుంచి గెలుపొందిన వారు నియోజకవర్గ స్థాయికి, అక్కడి నుంచి జిల్లా స్థాయికి, అనంతరం రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ వివరించారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో విద్యార్థులు, యువకులతో పాటు అన్ని వయసుల క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని క్రీడాప్రియులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.