09-01-2026 03:19:29 PM
తొగర్రాయి గ్రామంలో అంగరంగ వైభవంగా కోయదేవతల పూజలు
కోదాడ: కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో స్వయంభూ కోయదేవతలు సమ్మక్క సారలమ్మల చిన్న జాతరను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ పూజారి గవిని సైదమ్మ ఆధ్వర్యంలో జాతర కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క గద్దెల వద్ద జాతర ప్రారంభోత్సవంగా గ్రామంలో అమ్మవారి పసుపు బండారు ఊరేగింపును నిర్వహించారు. అనంతరం గద్దెల సమీపంలో భక్తులు బోనాలు చెల్లించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శనివారం రోజున అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించే కార్యక్రమం జరగనుండగా, మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరకు సంబంధించిన అన్ని పూజా కార్యక్రమాలను బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు పూజారి గవిని సైదమ్మ వెల్లడించారు.సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే కొంగుబంగారం కోయదేవతలుగా, కోరిన కోరికలు తీర్చే వనదేవతలుగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారలమ్మల కృప కోసం యావత్ గ్రామ ప్రజలు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుంచి బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి చెల్లించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పూజారి భక్తులను కోరారు.