06-01-2026 12:18:35 AM
జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
పినపాక, జనవరి 5 (విజయక్రాంతి): పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం గ్రామంలో ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానున్న జాతీయ స్థాయి అండర్17 బాలుర కబడ్డీ పోటీలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పినపాక జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ ఆవరణలో కబడ్డీ పోటీల నిర్వహణ కోసం చేపడుతున్న ప్రాంగణ అభివృద్ధి పనులు, కబడ్డీ కోర్టుల నిర్మాణం, ప్రేక్షకుల గ్యాలరీలు, క్రీడాకారుల వసతి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, వైద్య సేవలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు, సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీ య స్థాయిలో కబడ్డీ వంటి ప్రముఖ క్రీడా పోటీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించడం జిల్లాకు గర్వకారణమన్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా జిల్లాకు మంచి గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమం కావడంతో ఎక్కడా చిన్న లోపం కూడా తలెత్తకుండా అత్యుత్తమ ప్రమాణాలతో పోటీలను నిర్వహించాలని అధికారు లను ఆదేశించారు. క్రీడాకారులు, కోచ్లు, సాంకేతిక నిపుణులు, రిఫరీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్నందున ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.
క్రీడాకారుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. వసతి గృహాల్లో పరిశుభ్రత, నాణ్యమైన భోజన ఏర్పాట్లు, స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని తెలిపారు. క్రీడాకారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా 24 గంటల వైద్య సేవలు, అంబులెన్స్, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పోటీ ప్రాంగణం, వసతి ప్రాంతాలు, ప్రధాన రహదారులపై తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. అలాగే అగ్నిమాపక శాఖ సహకారంతో ఫైర్ సేఫ్టీ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పోటీ ప్రాంగ ణం పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీ నుండి పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం గ్రామంలో జాతీయ స్థాయి అండర్17 బాలుర కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ పోటీలు జిల్లాలో జరగడం జిల్లావాసులందరికీ గర్వకారణం. రాష్ట్రంలో కబడ్డీపై ఆసక్తి, అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పోటీలకు హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలి. దేశంలోని పలు రాష్ట్రాల నుండి వచ్చే క్రీడాకారులు, అధికారులు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకునే అవకాశం కూడా కలుగుతుంది. అలాగే గోదావరి తీర ప్రాంతాల సహజ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
పోటీల నిర్వహణకు సంబంధించి హైదరాబాద్కు చెందిన పలు ప్రముఖ సంస్థలు సి.ఎస్.ఆర్. ద్వారా విలువైన సహకారం అందిస్తున్నా యి. వారికి జిల్లా యంత్రాంగం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్రీడాకారులందరూ ఉత్సాహంగా పాల్గొని ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి తెలంగాణకు గోల్ మెడల్ సాధించాలని ఆకాంక్షి స్తున్నాను అని అన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పోటీలు సజావుగా, ప్రశాంత వాతావ రణంలో నిర్వహించేందుకు ప్రతి అధికారి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.