calender_icon.png 26 August, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి

26-08-2025 06:14:16 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ఎవరైనా సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రైవేట్ ఆసుపత్రిల నిర్వాహకులకు "క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పి.ఎన్.డి.టి చట్టం"పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అన్నారు.

అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసర మార్గాలు, లిఫ్టులు ఉన్నచోట అదనపు మెట్ల మార్గాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉంటే ఐసీసీ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రైవేటు అంబులెన్స్లను వారి ఆసుపత్రుల్లోనే నిలుపుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిలిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మున్సిపల్ శాఖకు చెల్లించాల్సిన ఆస్తి పనులను విధిగా చెల్లించాలని అన్నారు. సిజేరియన్ కాన్పులలో కరీంనగర్ ముందుండడం బాధాకరమైన విషయమని అన్నారు. అనవసరంగా సిజేరియన్లు చేయకూడదని, సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రయత్నించాలని సూచించారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు వంటివి వెలుగు చూస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.