28-12-2025 01:08:25 AM
ఇక ఉద్యమం--మరింత బలోపేతం
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధమైన భరోసా ఇవ్వాల్సిందే
దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలకు అన్యాయమే
రిజర్వేషన్ల ద్వారానే బీసీల సమస్యలు పరిష్కారం
సానుకూలంగా స్పందించకుంటే తిరుగుబాటు తప్పదు
అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు
ముషీరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): బీసీల 42శాతం రిజర్వేషన్ల సాధన కు త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. రాజకీయ పార్టీ లకు అతీతంగా బీసీ నాయకులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి రిజర్వే షన్ల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకె ళ్లానని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాండ్స్‌లో బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన 80 కుల సంఘాలు, 36 బీసీ సంఘాలు, 28 ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, విద్యార్థి, మహిళా, కళామండలి, ప్రజా మండలి సంఘాలతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీ య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి గంగుల కమలాకర్, బీసీ మేధావుల ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు తదితరులు హాజరై ప్రసంగించారు.
రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
కులగణన లెక్కలు బయటపెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లతోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని వక్తలు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నదని, 42 శాతం రిజర్వేషన్ల ద్వారానే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అందుకు బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మర్యాద పేరుతో అసెంబ్లీలోకి వెళ్లి అరవడం తప్ప, బీసీలకు చట్టపరమైన హక్కులు ఇవ్వలేదన్నారు. రిజర్వేషన్ల అంశం కోట్ల మంది బీసీల జీవన హక్కుల ప్రశ్న అని, పార్లమెంట్‌లో బీసీ బిల్లుపై చట్ట సవరణ చేయలేదన్నారు. ఇది పార్టీ పోరాటం కాదు.. బీసీల హక్కుల పోరాటమన్నారు.
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధమైన భరోసా ఇవ్వాలని, పార్లమెంట్‌లో బిల్లును తక్షణమే ఆమోదించాలని, అంతవరకు ఉద్యమం ఆగదన్నారు. ఈనెల 29న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి కూడా 42 శాతం రిజర్వేషన్లు విషయంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పాలకులు సానుకూలంగా స్పందించకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, జేఏసీ వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, బీసీ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోలా జనార్దన్ గౌడ్, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ నాగుల శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, బీసీ సంఘాల నేతలు నీల వెంకటేష్ ముదిరాజ్, సి. రాజేందర్, జి. అనంతయ్య, నందగోపాల్, దుర్గయ్య గౌడ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.