07-10-2025 03:37:29 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం,(విజయక్రాంతి): యువత ఉజ్వల భవిష్యత్తుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లు మార్గదర్శిగా పనిచేస్తాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించి బంగారు భవిష్యత్తుకు మార్గాలు వేసే అధునాతన సాంకేతిక కేంద్రంలో సత్వరమే యంత్రాలు, తరగతి గదులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఏటిసి ప్రిన్సిపాల్ ను, అధ్యాపకులను ఆదేశించారు. మంగళవారం కాటారం మండలంలోని ఏటీసీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ల్యాబ్‌లలో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించారు. పరికరాలు సకాలంలో అమర్చకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే పరికరాల ఏర్పాటు విషయంలో ఏర్పడిన సమస్యలను తన దృష్టికి తీసుకురాకపోవడంపై ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. విద్యార్థుల శిక్షణకు అవసరమైన అన్ని పరికరాల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్రం నిర్వహణలో పారదర్శకత, సమర్థత పాటించాలని, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని హెచ్చరించారు. విద్యార్థుల శిక్షణకు అవసరమైన అన్ని సదుపాయాలు వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.