05-07-2025 04:36:15 PM
ఆలస్యంగా వెలులోకి..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య గొంతు నులిమి హత్య చేసిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్(Bachupally Police Station) పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్, రామకృష్ణయ్యపల్లికి చెందిన అంజిలప్ప, రాధకు 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఈ దంపతులు వలస కూలీలుగా జీవనోపాధి కొనసాగించేవారు. ఈ క్రమంలోనే 2025 ఏప్రిల్ లో బాచుపల్లిలోని కాంట్రాక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో వజ్ర ప్రతీక కన్స్ట్రక్షన్స్ లో కూలీలుగా పనిచేస్తూ ఉండేవారు. రాధ తరచుగా తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడేది. జూన్ 22న అంజిలప్ప మద్యం సేవించి వచ్చాడు.
అదే రోజు సాయంత్రం రాధ భర్త రాధపై దాడి చేశాడు. అనంతరం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో భర్త మద్యం మత్తులో ఉండడంతో రాధ అతని ఛాతిపై కూర్చొని, గొంతు నులిమి హత్య చేసింది. హత్యను దాచేందుకు తన భర్త మితిమీరిన మద్యం సేవించడం వల్ల మరణించినట్లు స్థానికులను, కుటుంబ సభ్యులను నమ్మించి, మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తన స్వగ్రామానికి తరలించింది. అయితే మృతుడు సోదరుడు గాయాలు గుర్తించి, నారాయణపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఈ కేసును బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ నెల 1న బాచుపల్లి పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి విచారించగా తన భర్త రోజూ మద్యం సేవించి హింసిస్తున్నాడనే హత్య చేసినట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితురాలిపై సెక్షన్ 103(1), 238 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి, కోర్ట్ లో హాజరుపరినట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు.