05-07-2025 04:39:28 PM
రాష్ట్ర గవర్నర్ కు సామాజిక ఉద్యమకారుడు ఫిర్యాదు..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తెలంగాణ సమాచార కమిషన్(Telangana Information Commission)లో సంపూర్తి సమాచారం ఇవ్వకుండా చట్టబద్ధంగా తీర్పు ఇవ్వని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కమిషనర్ ను సమాచార హక్కు చట్టం సెక్షన్ 17 ప్రకారం ఆ పదవి నుండి తొలగించాలని నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వావిలాల రాజశేఖర్ శర్మ శనివారం రాష్ట్ర గవర్నర్ కు రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేశారు.
రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన సమాచార హక్కు చట్ట ప్రకారంగా తాను సమాచారం కోసం దరఖాస్తు చేసి నాలుగు సంవత్సరాల తర్వాత కూడా తనకు సరైన సంపూర్ణ, సంతృప్తికరమైన సమాచారం ఇప్పించకుండా ఏకపక్షంగా వ్యవహరించి, చట్టవిరుద్ధంగా సంబంధిత శాఖ వారు సమాచారం ఇవ్వకున్నా ఇచ్చారని కమిషన్ తీర్పు ఇచ్చిందని వాపోయారు. సమాచారం కోసం నాలుగు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నా.. కమిషన్ సమాచారం ఇప్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా సమాచార కమిషనర్ల నియామకాలు చేసినా దరఖాస్తుదారులకు లాభమేమి లేదని ఏకపక్షంగా కమిషన్ వ్యవహరిస్తున్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు.