07-08-2025 12:11:56 AM
గజ్వేల్ కాంగ్రెస్ లో గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనంపల్లి
కాంగ్రెస్ దళిత నాయకుల భారీ ర్యాలీ, నిరసన
గజ్వేల్, ఆగస్టు 6: గజ్వేల్ లో జరిగిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ లేని విజయకుమార్ వేదికపైకి వెళ్లి గొడవ సృష్టించగా, కేసు నమోదు చేయాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సిగ్గుచేటని వర్గల్ మాజీ ఎంపీపీ మోహన్, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గజ్వేల్ లో గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనoపల్లి హన్మంతరావు ఒత్తిడితో డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్నీ నిరసిస్తూ బుధవారం గజ్వేల్ పట్టణంలో దళితులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్గల్ మాజీ ఎంపీపీ మోహన్, దళిత సంఘాల నేతలు వెంకటస్వామి, కొడకండ్ల నర్సింలు, వీరేశం, అనిల్, అండాలమ్మ, శివులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కెసిఆర్, హరీష్ రావు లాంటి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దళితులను ప్రోత్సహిస్తున్న నర్సారెడ్డిపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించడం సరికాదన్నారు. నియోజకవర్గంలోని నామినేటెడ్ పదవులను కట్టబెట్టి నర్సారెడ్డి దళితులకు సముచిత స్థానం కల్పించారన్నారు.
అది జీర్ణించుకోలేని మైనంపల్లి హన్మంతరావు, ప్రతాప్ రెడ్డిలకు అమ్ముడుపోయిన కొందరు దళితులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి లక్ష్యంగా విమర్శిస్తూ ప్రకటనలు ఇవ్వడం మన ఎదుగుదలను మనమే అడ్డుకున్నట్లు అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. నర్సారెడ్డిపై నమోదైన అట్రాసిటీ కేసు వెంటనే ఉపసంహరించని పక్షంలో కొండపాక విజయ్ కుమార్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
అట్రాసిటీ కేసును పోలీసులు తొలగించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, నాయకులు మహేందర్, శ్రీనివాస్, వెంకటేష్, కొమ్ము మల్లికార్జున్, రత్నాకర్, బాబు, గణేష్, సోక్కం సురేష్, బాలు, దయ్యాల యాదగిరి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.