08-08-2025 07:30:03 PM
- కోటపల్లి మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ
- కలెక్టర్ కుమార్ దీపక్..
కోటపల్లి (విజయక్రాంతి): వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. శుక్రవారం కోటపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీని ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డితో కలిసి సందర్శించారు. మందుల నిల్వలు, వార్డులు, పరిసరాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని కోరారు.
ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన..
మండలంలోని బొప్పారం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధి పొందిన వారు ఇండ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టాలని, నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన అంచనా ప్రతిపాదనలను సిద్ధం చేసి అందించాలని తెలిపారు.
గ్రామంలో పర్యటించి పారిశుధ్యం, తాగునీరు అంశాలను పరిశీలించి అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీటిని సరఫరా చేయాలని, వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా త్రాగు నీటిని కాచి చల్లార్చి వడపోసి త్రాగే విధంగా ప్రజలకు వివరించాలని తెలిపారు. గ్రామంలో ఇంటింటిని సందర్శించి జ్వర పీడితులను గుర్తించి తగు వైద్య సేవలు అందించాలని తెలిపారు.
సర్వాయిపేటలో..
సర్వాయిపేట గ్రామంలో కలెక్టర్ పర్యటించి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల తహసిల్దార్ రాఘవేంద్ర తో కలిసి సందర్శించి వంటశాల, తరగతి గదులు, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, మూత్రశాలలు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, ఆహారం తయారీకి తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసరాలు వినియోగించాలని తెలిపారు.
6, 7 తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్టు బోధించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, ఆహారం నాణ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు.
పిల్లలంతా బడిలో ఉండేలా చూడాలి..
బడి బయట పిల్లలు, మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలకు వచ్చేలా వారి తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతను వివరించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో అందిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ దృవపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అధికారులు, ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. కలెక్టర్ వెంట తహశీల్దార్, ఎంపీడీవోతో పాటు ఆయా శాఖల బాధ్యులు ఉన్నారు.