06-12-2025 12:21:05 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ర్ట ఆర్థిక లక్ష్య సాధనలో వ్యవసాయ రంగం అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రామీణ జనాభాలో 66 శాతం మందికి ఉపాధి అందించే వ్యవసాయం రాష్ర్ట జీఎస్‌వీఏలో 17 శాతం వరకు వాటా కలిగి ఉందని, అందువల్ల తెలంగాణ ఆర్థిక వృద్ధిలో వ్యవసాయ అభివృద్ధి కేంద్రబిందువుగా ఉంటుందన్నారు.
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటుపై శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయరంగం అభివృద్ధి సామర్థ్యాలు, విదేశీ పెట్టుబడి అవకాశాలు, భవిష్యత్ విజన్ స్పష్టంగా ప్రతిబింబించేలా ఏవీలను రూపొందించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2025 ప్రధాన లక్ష్యం.. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమేనని తెలిపారు.
ప్రస్తుతం రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ సుమారు 200 బిలియన్ డాలర్ల వద్ద ఉందని, వచ్చే రెండు దశాబ్దాల్లో తెలంగాణను 15 రెట్లు పెరిగి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే మహాదృక్పథానికి ఈ గ్లోబల్ సమిట్ ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. రైతు ఆదాయం పెరగడం, ఉత్పాదకత పెరుగుదల, విలువ ఆధారిత వ్యవసాయం విస్తరణ, ఎగుమతుల పెంపు ఇవన్నీ 3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలక అంశాలని మంత్రి తుమ్మల అధికారులకు వివరించారు.
‘వ్యవసాయ రంగం బలపడితేనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతు శ్రమే రాష్ర్ట అభివృద్ధికి మూలం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే మహా లక్ష్యంలో, వ్యవసాయం అత్యంత ముఖ్యమైన అంశంగా మారుతుంది. ’అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య, హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.