08-10-2025 01:28:04 AM
-ఆర్థిక బాధలతో మరణించిన డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
-మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో మరణించిన డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఆటో నడవక, కుటుంబ పోషణ భారమై గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆటో డ్రైవర్ అడవిపదిర గ్రామానికి చెందిన నాంపల్లి సతీశ్‌ను ఎల్లారెడ్డిపేటలోని ఆసుపత్రిలో మంగళవారం కేటీఆర్ పరామర్శించారు.
ఆయన కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అం దజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభు త్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన 93 మందికి పైగా ఆటో డ్రైవర్ల సమాచారాన్ని ప్రభుత్వానికి అందించినా, ఇప్పటివరకు స్పందించలేదన్నారు. చనిపోయిన ప్రతి ఆటో కార్మికుడి కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. బీఆర్‌ఎస్ హాయంలో తెచ్చిన డ్రైవర్ల ప్రమాద బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తేసిందని విమర్శించారు.
దీని కారణంగా దాదాపు 8.5 లక్షల మంది డ్రైవర్లకు బీమా సౌకర్యం లేకుండా పోయిందన్నారు. ఆటో డ్రైవర్లు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. కష్టం వచ్చిన ఆటో డ్రైవర్‌లకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు బీమా సౌకర్యంతో పాటు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు.
కానీ ఇప్పటి వరకు ఒక్క ఆటో డ్రైవర్‌కు కూడా ఆర్థిక సాయం చేయలేదని విమర్శించారు. డ్రైవర్లకు ఇప్పటికే 24 నెలల బకాయి పడిందని, ఒక్కో డ్రైవర్‌కు సుమారు రూ.24 వేల బాకీ పడిందని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్ సంఘాలు, డ్రైవర్లంద రూ కలిసి వస్తే ప్రభుత్వం మెడలు వంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా చేసుకుందామని పిలుపునిచ్చారు. కాగా దాదాపు రూ.రెండు లక్షల 30 వేల కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని, రోడ్డు వేయలేదని, కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయలేదని, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని చె ప్పారు. ఈ నిధులు ఎక్కడికి పోతున్నాయో కాంగ్రెస్ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.