08-10-2025 01:29:12 AM
తెలంగాణ నేతలతో ఉండవల్లిలో సుదీర్ఘ భేటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక సమావేశం జరిపారు. తెలంగాణ టీడీపీ నేతలతో సుదీర్ఘ విరామం తర్వాత మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సమర్థవంతమైన నాయకత్వానికే తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్ధిని నిలపాలా లేక మిత్రపక్షమైన బీజేపీకి మద్ద తు ఇవ్వాలా అంశంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.
కీలకమైన ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ క్రియాశీలంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. తెలంగాణ లోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని, కార్యకర్తల మనోభావాలను చంద్రబాబుకు వివరించారు. తెలంగాణలో కొత్తగా 1.78 లక్షల మందిని సభ్యులుగా నమోదు పూర్తిచేశామని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో క్రియాశీలంగా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నా రని, సరైన నాయకత్వాన్ని అందిస్తే, పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమని నేత లు చంద్రబాబుకు తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ప్రధానంగా ప్రస్తావించిన నేతలు, ఒకవేళ నియామకం ఆలస్యమయ్యే పక్షంలో, ముఖ్య నేతలతో రాష్ట్రస్థాయిలో ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. మండల అధ్యక్షుల నియామకానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయిందని, వాటిని వెంటనే పూర్తి చేయాలని అభిప్రాయపడ్డారు. నేతలు చెప్పిన విషయాలను సావధానంగా విన్న చంద్రబాబు..
పార్టీ బలోపేతంపై పలు కీలక సూచ నలు చేశారు. “అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాను. ముందుగా అన్ని స్థాయిల్లో కమిటీల నియామకాన్ని పూర్తి చేసి, పార్టీ కార్యకలాపాలను పెంచాలి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలి” అని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి సమర్థవంతమైన, అందరినీ కలుపుకొ నిపోయే నాయకుడిని త్వరలోనే ఎంపిక చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అర్వింద్ కుమార్‌గౌడ్, బక్కని నర్సింహులు, నర్సిరెడ్డి, క్రిష్ణమాచారి, అశోక్‌కుమార్‌గౌడ్, నందమూరి సుహాసిని, జోత్స్న తదితరులు పాల్గొన్నారు.