29 April, 2026 | 2:15 AM

ఆయిల్‌పామ్ పంటపై రైతులకు అవగాహన

29-04-2026 12:45 AM

పెబ్బేరు, ఏప్రిల్ 28: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని సూగూరు రైతు వేదికలో ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఆయిల్ పామ్ పంట ప్రాముఖ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సాగు విధానాలపై విస్తృతంగా వివరించారు.

ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయ అధికారి అంజనేయులు మాట్లాడుతూ, ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ పంటకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రోత్సాహకాలు మరియు సబ్సిడీలు అందిస్తున్నదని తెలిపారు. ఒకసారి ఆయిల్ పామ్ సాగు ప్రారంభిస్తే, దీర్ఘకాలం పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చని రైతులకు వివరించారు. పెబ్బేరు మండలానికి 200 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించినట్లు చెప్పారు.

ప్రతి ఆయిల్ పామ్ మొక్కకు రూ.20 సబ్సిడీ, అలాగే డ్రిప్ సాగుకు 90 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉందని వెల్లడించారు. అంతేకాకుండా, మొదటి సంవత్సరాల్లో అంతర పంటల సాగుకు ఎకరాకు రూ.4200 ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి భాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ యాదమ్మ పరశురాములు, మండల వ్యవసాయ అధికారి షేక్ మున్న, మండల ఉద్యానవన శాఖ అధికారి కృష్ణయ్య, కొత్త సూపర్ గ్రామ సర్పంచ్ పద్మ అర్జున్, వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రియునిక్ కంపెనీ ప్రతినిధులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.