calender_icon.png 19 August, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పోలీసుల రక్షణ పాఠాలు

18-08-2025 10:45:59 PM

సైబర్ నేరాలు, షీటీమ్‌పై అవగాహన

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మాంటెస్సరి హైస్కూల్ విద్యార్థులకు మహిళలు, పిల్లల రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ వంటి కీలక అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. సోమవారం ఆ స్కూల్ లో హుస్నాబాద్ ఎస్సై లక్ష్మారెడ్డి, షీ టీమ్ బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావివ్వకుండా, సోషల్ మీడియాను అవసరమైన మేరకే ఉపయోగించాలన్నారు. సైబర్ నేరాల పట్ల  అప్రమత్తంగా ఉండాలన్నారు.

చాలా సైబర్ నేరాలు చిన్న చిన్న తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్‌లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏ బ్యాంకు అధికారి కూడా ఫోన్‌లో మన వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ కార్డు నంబర్లు అడగరన్నారు. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి అడిగితే అది సైబర్ నేరంగా భావించి వెంటనే ఫోన్ కట్ చేసి, ఆ నంబర్‌ను బ్లాక్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు లేదా వారికి తెలిసిన వారు వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్సై బృందం విద్యార్థులకు షీ టీమ్ ప్రాముఖ్యం, నిర్వహించే విధులను వివరించింది.

పోక్సో చట్టాలు, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. లైంగిక వేధింపులను ఎలా గుర్తించాలో, 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్' గురించి వివరించారు. అలాంటి సందర్భాలలో ఎలా స్పందించాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియజేశారు. ఎవరైనా వేధించినా, రోడ్డుపై అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్ 100కు లేదా సిద్దిపేట షీ టీమ్ నంబర్ 8712667434కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.