19-08-2025 12:01:45 AM
నిర్వాహకులు పోలీస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి
డీఎస్పీ రవీందర్ రెడ్డి
మణుగూరు,(విజయక్రాంతి): వినాయక చవితి సందర్భంగా మండపాలు, పందిళ్ల ఏర్పాటు కోసం తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ముందస్తు అనుమతి కోసం పోలీస్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకో వాలని సూచించారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి డీజేలకు అనుమతులు లేనందున నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. సామాజిక మాధ్యమా ల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని, సందేహాలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. మండే స్వభావం కలిగిన వస్తువులను ప్రతిమల దగ్గర ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతవరణంలో ఆనందోత్సవాల మద్య శాంతియుతంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.