calender_icon.png 19 August, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రాలలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

18-08-2025 11:43:46 PM

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. జిల్లాలో పలు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ప్రజలు కుక్కకాటుకు గురవుతున్నారని, అందువలన ప్రజలు కుక్కలనుండి జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి వహించాలని అన్నారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రత్యేకించి అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలల్లో టాయిలెట్లు, పారిశుధ్యం పై ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. రామన్న 15 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండి ఎవరు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పారు.  అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ఆయా శాఖల అధికారులు వారి శాఖకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయడమే కాకుండా, వాటి లబ్ధిని సకాలంలో లబ్ధిదారులకు అందించే విధంగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

కాగా ఈ సోమవారం మొత్తం 69 ఫిర్యాదులు రాగా, జిల్లా అధికారులకు 32, రెవెన్యూ శాఖకు 37  ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రామోత్సవ్  క్రీడలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,  స్పెషల్ కలెక్టర్ కె సీతారామారావు, ఆర్డీవోలు రమణారెడ్డి శ్రీదేవి డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు  ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

అధికారులపై కలెక్టర్ ఆగ్రహం...

నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి పై స్థాయి అధికారులు రాకుండా డుమ్మా కొడుతూ వారి క్రింది స్థాయి అధికారులను ప్రజావాణికి పంపిస్తూ ఉన్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి రావడంతో ఆమె ప్రజావాణిలో అధికారులను నిలబెట్టి వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి చరిత పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆమె  12:15 కి ప్రజావాణికి చేరుకున్నారు.