06-11-2025 10:28:50 PM
ఎంఈఓ వెంకటేశ్వరరావు..
వాజేడు (విజయక్రాంతి): వాజేడు మండలంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తామని మండల విద్యాశాఖ అధికారి తేజావత్ వెంకటేశ్వరరావు అన్నారు. ఈయన అధ్యక్షతన గురువారం మండల కేంద్రంలో గల మండల సమైక్య కార్యాలయంలో మహిళా సంఘాలకు రిసోర్స్ పర్సన్స్ కు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యాశాఖ డిఆర్డిఏ సమన్వయంతో వయోజనులకు విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉల్లాస్ జిల్లా సమన్వయకర్త పీర్ల కృష్ణ బాబు పాల్గొని మాట్లాడారు. ఈయన మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాలవల్ల చదువుకు దూరమైనటువంటి పెద్దవారిని మహిళలను మళ్లీ చదువు వైపు ప్రోత్సహించి వయోజనులను వృద్ధులోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యంగా ఈ కార్యక్రమం నడుస్తుందని అన్నారు. చదువు మానేసిన వారికి విద్యను అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యచరణ చేశాయని తెలియజేశారు. కాగా వాజేడు మండలంలో లెర్నర్స్ 1449 ఉండగా వీరికి విద్యను అందించేందుకు వాలంటీర్స్ 177 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఒక్కొక్క వాలంటీర్ కు పది మంది చొప్పున విభజించి విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. మండలంలో గల నిరక్షరాశ్యులను గుర్తించి వారిని విద్య వైపు మళ్లించే ప్రయత్నం చేస్తామని ఏపీఎం సతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిలు రాజేశ్వరి, సునీత, సీసీలు మల్లేశ్వరి, వెంకటలక్ష్మి, సత్యనారాయణ, అకౌంటెంట్ భవాని, వివో ఏలు, వివో పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.