02-01-2026 08:46:01 PM
జిహెచ్ఎంసి విలీనం, విద్యా వ్యవస్థ, రోడ్డు సేఫ్టీపై ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు విమర్శలు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరణ, విద్యా వ్యవస్థ, రోడ్డు సేఫ్టీ అంశాలపై సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేశారు. జిహెచ్ఎంసిలో శివారు మున్సిపాలిటీల విలీనం అశాస్త్రీయంగా, ఆదరాబాదరాగా జరిగిందన్నారు. వార్డులు, డివిజన్ల పునర్విభజనలో లోపాలు సరిదిద్దకుండా బిల్లును ప్రవేశపెట్టారని విమర్శించారు.
గతంలో 650 చ.కి.మీ ఉన్న జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2,000 చ.కి.మీ వరకు విస్తరించడం వల్ల పర్యావరణం, వ్యవసాయం, చెరువులు, గ్రామ స్వపరిపాలన ప్రమాదంలో పడిందన్నారు. విలీనం ద్వారా ఆస్తి పన్నులు, ఇతర రుసుములు పెరిగి ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. ఈ విలీన ప్రక్రియను బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విపరీతంగా పెరిగాయని, విద్య సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజులు 50 శాతం పెరగడం ఆందోళనకరమని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు.
రోడ్డు సేఫ్టీ అంశం ఆలోచన మంచిదైనా ఆచరణలో లోపాలున్నాయన్నారు. రోడ్డు సేఫ్టీ సెస్ రూపంలో ఏటా వందల కోట్లు వసూలు చేస్తున్నా, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు బడ్జెట్ కేటాయించడం లేదని విమర్శించారు. కాగజ్‌నగర్‌లో రోడ్డు గుంత కారణంగా వ్యక్తి మృతి చెందిన ఘటనకు బాధ్యత ఎవరిదో ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రామా కేర్ సెంటర్లపై గతంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకాలేదన్నారు.