02-01-2026 08:59:55 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి పట్టణంలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో పాఠశాలకు చెందినటువంటి విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకు ముఖ్యఅతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని మరియు చాలామంది ఆడటానికి క్రేజ్ చూపెడతారని, వాలీబాల్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉన్నాయని ఆయన నిబంధనల గురించి ప్రతి విద్యార్థికి తెలిసి ఉండాలని తద్వారా వారు ఆ క్రీడలో నైపుణ్యం సాధించగలుగుతారని అభిప్రాయపడ్డారు.
పాఠశాల స్థాయిలో నిర్వహింపబడినటువంటి పలు పోటీలలో చాతుర్యాన్ని ప్రదర్శించినటువంటి విద్యార్థులకు వివిధ పోటీలకు ఎంపిక చేయడమే కాకుండా వాటిలో పాల్గొనేందుకు సరైనటువంటి శిక్షణతో పాటు వనరులను కల్పించి అగ్రగామిగా నిలుపుతున్నామని, ఇటీవల కాలంలో పెద్దపల్లి జిల్లా నంది మేడారంలో నిర్వహించినటువంటి ఎస్సీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలలో పాఠశాలకు చెందినటువంటి జి.హనీయాన్స్ రెడ్డి, 8వ తరగతి, అండర్-14 బాలుర విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరచడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో పతాకాన్ని సాధించి త్వరలో హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహించబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికపోవడం చాలా గొప్ప విషయమని వారు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.