02-01-2026 08:40:50 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశంను ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నికకు ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొని పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశంను మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా తాళ్ల వెల్లంల గ్రామ సర్పంచ్ జోగు సురేష్, ప్రధాన కార్యదర్శిగా సుంకనపల్లి గ్రామ సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య, కార్యదర్శిగా నేరడ గ్రామ సర్పంచ్ మిర్యాల వెంకటేశం, కోశాధికారిగా వనిపాకల సర్పంచ్ మహిపాల్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాటం వెంకటేశం మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతకు అహర్నిశలు కృషిచేసి న్యాయం చేస్తానని, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులను ఏకం చేసి స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతానికి కృషి చేస్తానని, సర్పంచుల హక్కులు, సంక్షేమం కోసం ఫోరం వేదికగా సమిష్టి పోరాటం సాగిస్తామని స్పష్టం చేసి, సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, చిట్యాల పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు.