02-01-2026 08:37:30 PM
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్
వనపర్తి టౌన్: జిల్లాలో అక్రమ మైనింగ్ ను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో అక్రమ మైనింగ్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మైనింగ్ ను అరికట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ సూచన మేరకు జిల్లాలో అక్రమ మైనింగ్ ను సీసీ కెమెరాల ద్వారా అరికట్టేందుకు కీలకమైన మార్గాలను గుర్తించాలని పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులకు సూచించారు. సంబంధిత కీలకమైన పాయింట్లను ప్రభుత్వానికి నివేదించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ పై పర్యవేక్షణ కొనసాగించడం జరుగుతుందని తెలిపారు.
కాబట్టి పోలీస్, ఇరిగేషన్, రవాణా శాఖల అధికారులు సమన్వయం చేసుకొని అక్రమ మైనింగ్ రవాణాను అరికట్టేందుకు సీసీ కెమెరాల అమర్చుటకు కీలకమైన ప్రాంతాలను గుర్తించి మైనింగ్ శాఖకు నివేదించాలని సూచించారు. సమావేశంలో మైనింగ్ శాఖ ఏడి గోవిందరాజులు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సిఐ కృష్ణయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.