calender_icon.png 18 July, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబర్ అత్యంత క్రూరుడు

17-07-2025 01:43:21 AM

- ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పాఠ్య పుస్తకం విడుదల

- అక్బర్ క్రూరత్వంతో పాటు సహనం ఉన్నవాడు

- ఆలయాల ధ్వంసం, రాజకీయ అణచివేతపై ప్రధాన దృష్టి

- మరాఠా చరిత్రకు విస్తృత ప్రాధాన్యత

న్యూఢిల్లీ, జూలై 16: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) 8వ తరగతికి సంబంధించి కొత్త సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకాన్ని విడుదల చేసింది. ‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ సిరీస్’లో భాగంగా 13 నుంచి 17వ శతాబ్ధం మధ్య భారతదేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తానుల నుంచి మొఘల్ శకం వరకు జరిగిన దురాఘతాలను సమగ్రంగా వివరించారు.

మరాఠాల పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూనే.. సుల్తానులు, మొఘల్స్ క్రూరత్వంపై ప్రధాన దృష్టి సారించారు. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్‌ను అత్యంత క్రూరమైన వ్యక్తిగా అభివర్ణించారు. బాబర్ తెలివితేటలు కలిగిన రాజుగా గుర్తింపు ఉన్నప్పటికీ తన స్వార్థం కోసం జనాభా మొత్తాన్ని ఊచకోత కోసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయినట్టు పుస్తకాల్లో ప్రచురించారు. మొఘల్స్‌లో అక్బర్ పాలనను మాత్రం క్రూరత్వం, సహనంతో కలగలిసిన మిశ్రమంగా పేర్కొన్నారు.

అయితే చిత్తోర్‌గఢ్ ముట్టడి తర్వాత అక్బర్ సుమారు 30వేల మంది పౌరులను ఊచకోత కోసేందుకు ఆదేశాలిచ్చినట్టు పుస్తకంలో ముద్రించారు. మొఘల్స్‌లో అత్యంత క్రూరుడిగా పేరు పొందిన ఔరంగజేబు దేవాలయాలు, గురుద్వారాలే లక్ష్యంగా తన రాజ్యపాలన సాగించాడని.. అతని చర్యలు రాజకీయ అణిచివేతకు భీజం పడినట్టు తెలిపింది. ‘నోట్ ఆన్ సమ్ డార్కర్ పీరియడ్స్ ఇన్ హిస్టరీ’ పేరుతో ఆయా కాలాల్లో జరిగిన ఆలయాల ధ్వంసం, రాజకీయ అణచివేత, అధిక హింసను హైలెట్ చేస్తూ పాఠ్య పుస్తకాల్లో ముద్రించారు.

ఢిల్లీ సుల్తానేట్, విజయనగర సామ్రాజ్యం, మెఘలులు, మరాఠా ఎదుగుదల, రాజకీయంతో పాటు వారి పతనాన్ని సమగ్రంగా వివరించారు. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్  ఆదేశాలతో సైన్యాధిపతి మాలిక్ కాఫర్.. మధురై, శ్రీరంగం, చిదంబరం హిందూ దేవాలయాలపై దాడులను ప్రస్తావించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి మరాఠా చరిత్రకు విస్తృత ప్రాధాన్యతను కల్పించారు.

మరాఠా పాలకులు చత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ హిందూ మతంతో పాటు అన్య మతాలను సమంగా గౌరవిస్తూనే హిందూ విలువలను నిలబెట్టారని పేర్కొన్నారు. ఢిల్లీ సుల్తానేట్లు, మొఘల్స్ కాలంలో ధ్వంసమైన హిందూ ఆలయాలను పునర్నిర్మించడంలో శివాజీ మహారాజ్ చేసిన కృషిని ప్రస్తావించారు. విద్యార్థులకు చరిత్రపై నిజాయితీ కూడిన ఆధారాలను అందించడమే తమ ఉద్దేశమని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది.