28-04-2025 08:11:53 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): భారతదేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పరుస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన వైద్య రంగంలో డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, కళా రంగంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, క్రీడ రంగంలో హాకీ ప్లేయర్ శ్రీజేశ్, అలాగే పద్మశ్రీకి ఎంపికైన మాడుగుల నాగఫణిశర్మ రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు.
ప్రఖ్యాత సినీ నటుడు మరియు హిందూపూర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అలాగే సనీ నటుడు అజిత్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తదితరులు ఇవాళ పద్మ పురస్కారాలను అందుకున్నారు. బాలకృష్ణ ఈ కార్యక్రమానికి సాంప్రదాయ పంచెకట్టు తెలుగు దుస్తులు ధరించి హాజరయ్యారు. ఈ వేడుకలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి ఉన్నారు. నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమకు, సమాజానికి చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈ పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. నటుడిగా, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా ఆయన చేసిన సేవలతో పాటు, సినీ పరిశ్రమలో బాలయ్య చేసిన కృషిని కూడా ఈ అవార్డుకు ఎంపిక చేయడంలో పరిగణనలోకి తీసుకున్నారు.
ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన వందకు పైగా చిత్రాలలో నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బాలయ్య వరుస చిత్రాలలో చురుకుగా నటిస్తూ యువ ప్రధాన నటులతో సమానంగా తన శక్తిని, ప్రాముఖ్యతను కొనసాగిస్తున్నారు. మాస్, యాక్షన్ చిత్రాలలో తన నటనకు పేరుగాంచిన ఆయన పౌరాణిక, చారిత్రక, సామాజిక నేపథ్య పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గతంలో బాలకృష్ణ ఫిల్మ్‌ఫేర్, నంది ప్రశంసలతో సహా అనేక అవార్డులను దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, శివరాజ్ సింగ్ చౌహాన్, జితేంద్రసింగ్ తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ సగం మందికి పురస్కారాలను ప్రదానం చేశారు. మిగిలిన వారికి త్వరలో ప్రదానం చేసే అవకాశం ఉంది.