calender_icon.png 10 November, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం

10-11-2025 06:54:12 PM

జేఎన్ఎస్ లో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ స్నేహ శబరీష్..

హనుమకొండ (విజయక్రాంతి): డీడీజీ (స్టేట్స్), జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్, చెన్నై, డైరెక్టర్ రిక్రూటింగ్, ఏఆర్ఓ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ సోమవారం ఉదయం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో(జేఎన్ఎస్)లో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఉదయం 2:30 గంటలకు సైన్యాధికారుల సమక్షంలో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల అభ్యర్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ రెండు జిల్లాల నుండి 794 మంది వ్రాత పరీక్షలో అర్హత సాధించగా, 624 మంది హాజరై హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో ఫిజికల్ ఫిట్నెస్, ఇతర పరీక్షల్లో పాల్గొన్నారు.

సైన్యాధికారుల ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల అభ్యర్థులు ఇప్పటికే వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, నవంబర్ 10 నుండి 22 వరకు ఫిజికల్, ఫిట్నెస్, మెడికల్ పరీక్షలను హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో ఎదుర్కోనున్నారు. ఈ కార్యక్రమానికి సైన్యాధికారులు, జిల్లా యువజన, క్రీడా అధికారి అశోక్ కుమార్ గుగులోతు, ఇతర అధికారులు హాజరయ్యారు. సైన్య సిబ్బందికి ఇండోర్ స్టేడియం, యూత్ హాస్టల్ వద్ద వసతి ఏర్పాట్లు చేయబడ్డాయి. అభ్యర్థుల కోసం తాగునీరు, టెంట్ సదుపాయాలు కల్పించారు. వేదిక ప్రధాన ద్వారం, పరిసర ప్రాంతాల్లో కఠిన పోలీసు భద్రత అమలు చేశారు. ఆర్మీ జారీ చేసిన ఐడీ కార్డులు కలిగిన వారికే ప్రవేశం అనుమతిస్తున్నారు.