10-11-2025 06:57:59 PM
గోదావరిఖని,(విజయక్రాంతి): సింగరేణి గోదావరిఖని 2వ గనిలో పనిచేస్తున్న కార్మికుడు పెంచాల తిరుపతి అనే వ్యక్తి తన బినామీల ద్వారా రామగుండం ఎన్టిపిసి బూడిద చెరువులో లోడింగ్ కాంట్రాక్టు పనులు దక్కించుకునేందుకు ప్రభావిత గ్రామమైన కుందనపల్లి గ్రామస్తుల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆ గ్రామస్తులు సోమవారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సింగరేణి సంస్థ కార్మికులకు నేర్పిస్తున్న సంస్కృతి ఇదేనా అని మండిపడ్డారు.
ఎన్టీపీసీ బూడిద చెరువు ప్రభావిత గ్రామమైన మాకు న్యాయపరంగా, చట్టబద్ధంగా దక్కాల్సిన బూడిద లోడింగ్ పనులను తమ గ్రామానికి ఎలాంటి సంబంధం లేని గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు పెంచాల తిరుపతి డబ్బులు ఇచ్చి కొంతమందిని బినామీలను సృష్టించుకుని తమ గ్రామంపై ఉసిగొలుపుతున్నాడని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగం చేయకుండా తమ గ్రామస్తులను బెదిరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ గ్రామంలో కలకలం రేపుతున్నాడని వాపోయారు.
ఆయన వల్ల గ్రామంలో అశాంతి వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ఇప్పటికే పెంచాలని తిరుపతిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో అనేక కేసులు ఉన్నాయని, బూడిద లోడింగ్ పనులతో కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదిస్తూ సింగరేణి నౌకరి చేయకుండా తమ గ్రామం పై పడి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, అతనిపై సింగరేణి యాజమాన్యం క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకోవాలని కోరారు.