calender_icon.png 28 November, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాపు.. నువ్ లేకుండానే ఓదెల తెల్లారింది!

27-11-2025 12:00:00 AM

- దర్శకుడు సంపత్ నందికి పితృవియోగం 

- సోషల్‌మీడియాలో భావోద్వేగపూర్వక పోస్ట్ 

తెలుగు దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి నంది కిష్టయ్య (73) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కిష్టయ్య మంగళవారం రాత్రి తమ నివాసంలో కన్నుమూశారు. కిష్టయ్య మృతిపై పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేశారు. డైరెక్టర్ సంపత్ నంది స్వస్థలం ఓదెల గ్రామం. ‘ఏమైందీ ఈ వేళ’ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన సంపత్.. ఇటీవల ‘ఓదెల2’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ప్రస్తుతం ఆయన తెలుగులో శర్వానంద్ హీరోగా నటి స్తున్న ‘భోగి’ సినిమాను రూపొందిస్తున్నారు. తెలంగాణ సరిహద్దు జరిగే కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంపత్ నంది తన తండ్రి మరణంపై సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. “బాపు.. నువ్ లేకుండానే ఇక రేపు, ఎల్లుండి, జీవితమంతా. నువ్ లేకుండానే తెల్లారింది.. నువ్ లేకుండానే ఓదెల లేచింది. చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10 కిలోమీటర్లు ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది.

గంగుల కనకయ్య చుక్కల థియేటర్‌లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నెన్నే కదా అనిపిస్తోంది. నువ్ నేర్పిన ఎడ్లబండి నడక.. మనం దున్నిన జంబు అరక.. పత్తి మందుకు పంపు.. పల్లి చేనులో సద్ది.. మిరప నారుతో నాటు.. బురద పొలంలో జలగలతో పాట్లు.. ఇక అన్నీ జ్ఞాపకాలేనా? దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు.. ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా? ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్‌లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి.. నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్లకూ పిల్లలున్నారు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో.. కానీ మళ్లీ రా..” అంటూ సంపత్ నంది.. తమ తండ్రీకొడుకుల బంధాన్ని, వారి మధ్య గుర్తులను నెమరు వేసుకున్న తీరు అందరినీ జ్ఞాపకాల దొంతరలోకి నెట్టివేసింది.