calender_icon.png 24 January, 2026 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తజనంతో బాసర పులకింత

24-01-2026 12:59:10 AM

వసంత పంచమికి పోటెత్తిన భక్తులు

పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

నిర్మల్, జనవరి 23 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన నిర్మల్ జిల్లాలోని జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్, ముథోల్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్ పట్టు వస్త్రాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ తన కూతురుకు అక్షరాభ్యాసాన్ని చేయించారు. ఎస్పీ జానకి, కలెక్టర్ సంగీత్ కుమార్, ఆలయ ఈవో అంజలి దేవి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.

అమ్మవారి పుట్టినరోజు అయిన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యావంతులవుతారన్న నమ్మకంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. దర్శనానికి మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. ఈసారి వెయ్యి రూపాయల ప్రత్యేక దర్శనం కేటాయించగా భక్తులు పెద్ద సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసి క్యూలో నిలబడ్డా దర్శనం త్వరగా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.