25-09-2025 01:02:14 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతి రూపం బతుకమ్మ పండుగ అని, ఘనంగా బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ల లెనిన్ వత్సల్ టోప్పో, కే.అనిల్ కుమార్, సంబంధిత అధికారులతో కలిసి జిల్లాలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 21 నుండి 30 వరకు తెలంగాణ ఆడపడుచుల పండగ బతుకమ్మ వేడుకలు అధికారికంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా బతు కమ్మ ఏర్పాట్లు చేయాలని, బతుకమ్మ ఆడే ప్రదేశాలు చెరువులు కుంటలు దేవాలయాలు తదితర ప్రదేశాలలో ప్రభుత్వం సూచించిన ప్రకారం విద్యుత్ కాంతులతో సకల ఏర్పాట్లను చేయాలని సంబంధిత మున్సిపల్, పంచాయతీరాజ్, అన్ని విభాగాల సిబ్బందిని ఆదేశించారు.
దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం సూచించిన ప్రదేశాలలో క్రేన్స్ లైటింగ్ శానిటేషన్ రక్షణ(బందోబస్తు) ఏర్పాటు చేయాలని, మహిళలకు, వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్త్రీ శిశు సంక్షేమ, మహిళా భద్రత, సఖి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మెప్మా, స్వయం సహాయక బృందాలు, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ తదితర విభాగాల సంక్షేమ పథకాలు అమలు ప్రదర్శన ద్వారా బతుకమ్మ ఆటలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు తదితరులకు ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని, క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని, జిల్లాలోని ప్రతి ఒక్కరినీ , స్వచ్ఛంద సంస్థలను అన్ని వర్గాల వారిని ఈ వేడుకలలో భాగస్వామ్యులను చేయాలన్నారు.
కలెక్టరేట్ లోని అన్ని విభాగాల వారు పక్కా ప్రణాళికతో బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి సభ్యులచే ఇతర కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి తిరుపతిరావు, జిల్లా పరిషత్ సీఈవో పురుషోత్తం, జిల్లా హార్టికల్చర్ అధికారి మరియన్న, డిపిఓ హరిప్రసాద్, డీఎస్‌ఓ ప్రేమ్ కుమార్, డిపిఆర్‌ఓ పి.రాజేంద్రప్రసాద్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, వివిధ విభాగాల జిల్లా అధికారులు, సెక్షన్ పర్యవేక్షకులు రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.