14-09-2025 01:49:35 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) : బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24వ తేదీన హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ‘బీసీ బతకమ్మ’ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
బీసీ మహిళా సంఘం రాష్ర్ట అధ్యక్షురాలు బర్ల మణి మంజరిసాగర్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని బీసీ భవన్‌లో శనివారం నిర్వహించిన బీసీ మహిళా సంఘం విస్తృత స్థాయి సమావేశంలో జాజుల పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ మనసు కరిగి బీసీల ఆకాంక్షలు నెరవేర్చాలని బీసీల బతుకమ్మ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనాభాలో సగభాగానికి పైగా బీసీలు ఉంటే అందులో సమానంగా మహిళలు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగితేనే వారికి ఆయ రంగాల్లో అవకాశాలు దక్కడంతోపాటు వెనకబడిన వారికి సాధికారత లభిస్తుందన్నారు. మణిమంజరి మాట్లాడుతూ... రిజర్వేషన్ల్లు పెంచాలని బీసీలు 22 నెలలుగా పోరాడుతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు.
తొలిసారిగా బీసీ డిమాండ్ల సాధనకు బతుకమ్మ ద్వారా బీసీల గొంతుకను వినిపిస్తామని, రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమానికి బీసీ మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట కార్యనిర్వాక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ మహిళా సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, కార్యనిర్వాక కార్యదర్శులు సంధ్యా రాణి, కే సుజాత, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు సిద్ధాంతం శ్యామల, పద్మావతి, కోడూరి శ్రీదేవి, బి సరిత, వరలక్ష్మి, జి లావణ్య యాదవ్, రేణుక, వరికుప్పల మధు, గూడూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.