14-09-2025 01:39:54 AM
గద్వాల, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, వారితోనే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నేత, గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది మాజీ కౌన్సిలర్లు, 30 మంది మాజీ ఎంపీటీసీలు, 30 మంది మాజీ సర్పంచ్‌లు, పలువురు మాజీ జట్పీటీసీలు శనివారం గద్వాలలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమంత్‌నాయుడు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ గర్జన సభలో కేటీఆర్ నిప్పులు చెరిగారు.
బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, చివరకు తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్పుకోవాల్సి వచ్చిందని, ‘స్త్రీ లింగం కాదు.. పురుష లింగం కాదు.. 10 మంది ఎమ్మెల్యేలది ఏ లింగమో వాళ్లకే తెలియాలి’ అని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని సన్నాయి నొక్కులు నొక్కారని, మరి సీఎం అయ్యాకే ఇప్పుడెందుకు పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో కొట్టడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంట్, యూరియా, పెట్టుబడి సాయం అందక ఇబ్బంది పడుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చామని, కరోనా వంటి సంక్షోభ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలు ఆపి రైతులకు రైతుబంధు ఇచ్చామని, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
అలవిగాని హామీలిచ్చి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కేవలం 10 వేల ఉద్యోగాలను భర్తీ చేశారని, వాటిలో మేజార్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైంది..బీఆర్‌ఎస్ పాలనలోనే అని పేర్కొన్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి ఒకనాడు.. తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుస్తున్నారని ప్రకటించారని, కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే రైలు పట్టాలపై తలపెట్టడం మేలని ప్రకటించారని, అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడెందుకు కాంగ్రెస్‌లో చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు.
స్పీకర్‌కు ఇచ్చిన వివరణలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తాను బీఆర్‌ఎస్‌లో ఉన్నానని చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మున్ముందు గద్వాలలో ఉప ఎన్నిక ఖాయమని జోస్యం చెప్పారు. అంతకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌దే హవా అని ధీమా వ్యక్తం చేశారు.
హామీలు ఏమైనయి?
ఆరుగ్యారెంటీల పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. అత్తకు రూ.4 వేలు, కోడలికి రూ.2,500 ఇస్తానని ఇప్పుడు ముఖం చాటేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఆ హామీ అమలు చేస్తుందని రాష్ట్రవ్యాప్తంగా 1.67 కోట్ల మంది మహిళలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని బీరాలు పలికి కొందరికే మాఫీ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తే, కాంగ్రెసోళ్లు రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని, తీరా అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఏమైందో ప్రజలకు తెలుసునన్నారు.
అలాగే పింఛను పెంచుతామని చెప్పి, ఆ హామీని మరచిపోయారని మండిపడ్డారు. సభలో ఎమ్మెల్యేలు విజేయుడు, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్టీ ముఖ్యనేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, రజిని, అంజయ్య యాదవ్, జైపాల్‌యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఇంతియాజ్, రంగినేని అభిలాష్ పాల్గొన్నారు.
గ్రూప్- 1 ఉద్యోగాలు కోట్లకు అమ్ముకున్నారు..
గ్రూప్- 1 కొలువు సాధించేందుకు నిరుద్యోగులు అహర్నిశలు కష్టపడి చదివి, పరీక్షలు రాస్తే ప్రభుత్వ పెద్దలు ఆ పోస్టులను అమ్ముకున్నారని కేటీఆర్ ఆరోపిం చారు. ‘గద్వాల కు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు?’ అని అలంపూర్‌కు చెందిన ఓ నాయకుడు సోషల్ మీడియా వేదికగా తనను నిలదీయడం విడ్డూరమని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘గద్వాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వమే జిల్లా చేసింది.
జిల్లాకు మెడికల్, నర్సింగ్ కళశాల ఇచ్చింది. ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పాం’ అని కేటీఆర్ గుర్తుచేశారు. అంత అభివృద్ధి చేసి కూడా తమను గద్వాలకు రావొద్దనడం సిగ్గుచేటన్నారు. గద్వాలలోని మెడికల్ కళాశాల దర్గా పక్కనే తమ ప్రభుత్వం పేదల కోసం ఇండ్లు నిర్మించిందని, ఆ ఇండ్లకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రంగుల వేసి ప్రారంభించడమేంటని ప్రశ్నించారు.
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని రాజోలి మండలం ధన్వాడ గ్రామస్తులందరూ ఉద్యమం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందని ధ్వజమెత్తారు. 15 రోజుల పాటు జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు.
అలాంటి సమయంలో బాధితు లకు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అండగా నిలిచారని గుర్తుచేశారు. అలాగే నిర్మల్ జిల్లా దివలపూర్‌లోనూ ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమించారని, దీంతో ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నదని తెలిపారు.