14-09-2025 01:49:16 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే.. తెలంగాణాకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాలో చుక్కనీరు కూడా వదులుకొనే ప్రసక్తి లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని న్యాయ నిపుణులు, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని సూ చించారు. అందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని ఆదేశించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉండగా, రాష్ర్ట ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
స్వయంగా మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి విచారణలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన విధానంపై శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
స మావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ కే వోహ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఇంతకాలం కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేసి, మనకు దక్కాల్సిన ప్రతీ నీటిచుక్కను దక్కించుకునేలా వాదనలు వినిపించాలని ఈ సంద ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి న్యాయ నిపుణులకు సూచనలు చేశారు.
ఉమ్మడి రాష్ర్టం నుంచి ఇప్పటివరకు కృష్ణా నదిపై ఉన్న ప్రా జెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంచాలని కోరారు. ఉమ్మడి రా ష్ర్టంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డా క్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.
తెలంగాణకు తీరని అన్యాయం...
గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టి, 299 టీఎంసీల వాటా కు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్న అంశం చర్చకు వచ్చింది. అప్పటి సీఎం కేసీఆర్ 299 టీఎంసీల వాటాకు ఒప్పుకున్న విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యునల్ ముందుకు తెచ్చిందని న్యాయ నిపుణు లు సీఎంకు వివరించారు. ఉమ్మడి రాష్ర్టం లో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవటంతో ఈ పరిస్థితి వచ్చిందని సీఎం అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయ పరమైన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందని ఆరోపించారు. కృ ష్ణాపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్‌లో పెట్టిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావా ల్సి ఉందని, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
బలమైన వాదనలు వినిపిస్తాం..
కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తాను పాల్గొనబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. ట్రిబ్యునల్- విచారణలో అనుస రించాల్సిన అంశంపై శనివారం జలసౌధలో న్యాయనిపుణులు, నీటి పారుదల రంగ నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సైతం అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీకి చేరుకొని సమీక్షిస్తారని వెల్లడించారు. కృష్ణా జలాశయాల్లో రాష్ర్ట వాటాను సాధించేందుకు బలమైన వాదనలు వినిపించేందుకు పూర్తి స్థాయిలో అధి కార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని, వా రు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయవాదులు తెలంగాణకు చెందాల్సిన నీటి వాటా పై వాదనలు వినిపించనున్నారని పేర్కొన్నారు.
కేడబ్ల్యూడీటీ ఎదుట 2025, ఫిబ్రవరి నుంచి వాదనలు కొనసాగుతున్నాయని, సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతా నికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించారని తెలిపారు. శాస్త్రీయంగా నీటి కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అనధికార బేసిన్‌ల వివరాలు, తెలంగాణ ప్రాంతంలో సా గునీటి అవసరాలు అందులో పొందుపరిచారని పేర్కొన్నారు. 1956 జలవివాద చట్టం, 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన విషయంపై వాదనలు వినిపించామన్నారు.
811 టీఎంసీల కృష్ణా జలాశయాల్లో తెలంగాణ ప్రాంతానికి 71 శాతం కేటాయింపులు ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65 శాతం కేటా యింపులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు పూర్తి గా వినిపించగా తాజాగా అధికారులు అందిస్తున్న నివేదికల ప్రకారం జూన్, జులై మాసా ల్లో ఇక్కడికి అవసరమైన నీటి కోసం 80 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచేలా వాదనలు వినిపిస్తామని వెల్లడించారు.
రోజుకు పది టీఎంసీల తరలింపు..
శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తోందని, ఇతర బేసిన్‌లకు తరలించుకుపోతోందని సీఎం పేర్కొన్నారు. ఎక్కడపడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవటంతో పాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్‌కు నివేదించాలని ఆదేశించారు.
కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టులు మూత పడే ప్రమాదం ఉందన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ర్టం కావటంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలున్నాయని సీఎం వివరించారు.
సాగు, తాగునీటి అవసరాలతో పాటు మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే కృష్ణా జలాశయాలను తెలంగాణ వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలన్నారు.
నీటి విభజన జరగాల్సిందే..
ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ చట్టంలోని సెక్షన్ 4(1)(ఏ)తో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదకొండో షెడ్యూల్ పదో పేరా వంటి న్యాయపరమైన అంశాలను కూడా విచారణలో వాదించబోతున్నట్టు మంత్రి వివరించారు. ఏపీ పభుత్వం అక్రమంగా వినియోగిస్తున్న 291 టీఎంసీల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్, నదుల నిర్వహణ బోర్డుల ఎదుట ఏపీ ప్రభుత్వం తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులపై అడ్డుపడుతుండటంతో ఒకింత ఆలస్యం జరుగుతోందని, ప్రాజెక్టుల నిర్మాణాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కూడా ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనల్లో వినిపిస్తామన్నారు. తమ వాదనలకు బలం చేకూరేలా ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణాల అంశాలతో కూడిన ప్రత్యేక జీవోను రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుందన్నారు.
వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపుతో పాటు హైదరాబాద్ మహానగరం తాగునీటి అవసరాల కోసం కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్లకు వంద టీఎంసీలను మళ్లించడానికి వీలుగా రూపకల్పన చేసిన జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాళ్లు ఉన్నాయన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ట్రిబ్యునల్ ఇప్పటికే గుర్తించిందని, తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుతామని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.