calender_icon.png 14 September, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు చతికిల!

14-09-2025 01:30:51 AM

ఫీజు బకాయిలతో కుదేలవుతున్న కాలేజీల వ్యవస్థ

  1. రావాల్సిన బకాయిలు 8,200 కోట్లు 
  2. చెల్లించడంలో సర్కారు తీవ్ర నిర్లక్ష్యం 
  3. విద్య నాణ్యతతోపాటు విద్యార్థులపై ప్రభావం 
  4. బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు 
  5. మద్దతు తెలిపిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా రంగం చతికిల పడుతోంది. గత, ప్రస్తుత ప్రభుత్వాల తీరుతో ఉన్నత విద్యనందించే కాలేజీలు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపో యాయి. దీంతో కాలేజీలను నడపలేక, అధ్యాపకులకు, సిబ్బందికి వేత నాలు ఇవ్వలేక యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ఐనా ప్రభుత్వం మొద్దనిద్ర వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తామంటూ ఇచ్చే హామీలన్నీ నీటిమూటలుగా మిగులుపోతున్నాయి. అన్ని వెరసీ లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలు బిడ్డల చదువులపై ప్రభావం పడుతోంది.

రేపుమాపంటూ ప్రభుత్వ పెద్దలు చేతులు దులుపుకుంటున్నారే తప్పా, తమ గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రైవేట్ ఇంజినీరింగ్, వృత్తివిద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభు త్వంలోనే కాక ఈ ప్రభుత్వంలోనూ తమ పరిస్థితి ఏమాత్రం మారలేదని వాపోతున్నారు.

రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు దాదాపు రూ.8,200 కోట్లు. వీటిలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో చెల్లించాల్సినవి కూడా ఉండటం విశేషం. 2021-22 విద్యాసంవత్సరానికి రూ.200 కోట్లు నుంచి రూ.300 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

2022-23 విద్యాసంవత్సరానివి రూ.2,800 కోట్లు, 2023-24వి రూ.2500 కోట్లు, 2024-25కు చెందినవి రూ.2500 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.8,100 కోట్ల నుంచి రూ.8,200 కోట్ల వరకు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ విద్యాసంవత్సరం పూర్తయితే వీటికి అదనంగా మరో రూ.2500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 

ఆర్థిక ఇబ్బందుల్లో కాలేజీలు..

ప్రభుత్వం ప్రతీ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో యాజమాన్యాలకు విడుదల చేస్తేనే కాలేజీలు సక్రమంగా నడుస్తాయి. లేకుంటే అవి మూతపడే పరిస్థితి ఎదురవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తుందనే భావనతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తెచ్చుకొని నడుపుతున్నారు.

ప్రభుత్వం ఎంతకీ ఫీజులు చెల్లించకపోవడంతో తమ కుటుంబ సభ్యుల బంగారం, వెండి, ల్యాండ్ పేపర్లను తాకట్టు పెట్టి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు విద్యా సంవత్సరాల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.1200 కోట్లకు టోకెన్లు జారీ చేసింది. అయినా ఇప్పటివరకు వీటిని విడుదల చేయలేదు. మొత్తం రూ.8,200 కోట్లు బకాయిలను కాకపోయినా ఈ రూ.1200 కోట్లనైనా తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు.

జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో విధులకు హాజరుకాబోమంటూ యాజమాన్యాలకు అధ్యాపకులు, సిబ్బంది చెబుతున్నారు. జీతాలు చెల్లించకపోవడంతో అనుభవమున్న ఫ్యాకల్టీ అంతా కార్పొరేట్ కాలేజీలు, ప్రైవేట్ వర్సిటీలు, డీమ్డ్ వర్సీటీలకు వెళ్లిపోతున్నారు. మంచి ఫ్యాకల్టీ లేకుంటే కాలేజీల్లో విద్యార్థులు చేరరు.

తమ సమస్యను ప్రభుత్వం పట్టించకపోవడంతో విద్యార్థులపై ఆ ప్రభావం పడుతోందని కాలేజీల యాజమాన్యాలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15 నుంచి ఇంజినీరింగ్, వృత్తివిద్యా కాలేజీలు, 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్‌ను ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటించాయి.

ఫీజు పథకాన్ని ఎత్తివేసే కుట్ర: ఎస్‌ఎఫ్‌ఐ

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. పెండింగ్ ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీలు చేపట్టిన బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పూర్తి మద్దతును ప్రకటించింది.

విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కోసం కోర్టులకు వెళ్తున్న పరిస్థితి నెలకొందని పేర్కొంది. తెలంగాణ చరిత్రలోనే ఫీజుల కోసం మొదటిసారి యాజమాన్యాలు బంద్ చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని, తక్షణమే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రజనీకాంత్, టీ నాగరాజు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

 కాలేజీలు నడపలేం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో కాలేజీలను నడపటం భారమవుతుంది. సిబ్బంది జీతాలు, అద్దెలు, ఇతరత్రా ఖర్చులు ఎలా భరించాలి. దీనికితోడూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వెలుపల ఉన్న కొద్ది మంది విద్యార్థులు కూడా సకాలంలో ఫీజులు చెల్లించకపోవటంతో కాలేజీల నిర్వహణ భారంగా మారుతుంది.

అద్దె భవనాల్లో కొనసా గుతున్న చాలా కాలేజీలు అద్దెను, సొంత భవనాలు ఉన్న యాజమాన్యాలు బ్యాంక్ ఈఎంఐలను చివరికి కరెంట్ బిల్లులను కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం బకాయిలను వెంటనే విడుదల చేయాలి. లేకుంటే కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది.

 బీ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేట్ డిగ్రీ,

పీజీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు