14-09-2025 01:13:03 AM
జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ భార్య, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత
హైదరాబాద్‌లో డీజీపీ జితేందర్ ఎదుట లొంగుబాటు
రూ.25 లక్షల నగదు రివార్డు అందజేత
హైదరాబాద్ సిటీ బ్యూరో/గద్వాల, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ సుజాత 43 ఏళ్ల అజ్ఞాత జీవితానికి తెరదించి జనజీవన స్రవంతిలో కలిశారు. గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమబెంగాల్‌లో 2011లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య ఆమె.
ప్రస్తుతం ఛత్తీస్‌గడ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జిగా ఉన్నట్లు సమాచారం. ఆమె 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. శనివారం హైదరాబాద్‌లో డీజీపీ జితేందర్ సమక్షంలో ఆమె లొంగిపోయారు. ఆమె లొంగుబాటు మావోయిస్టు ఉద్యమంపై తెలంగాణ పోలీసుల సమగ్ర వ్యూహానికి నైతిక విజయంగా డీజీపీ అభివర్ణించారు. అంతేకాకుండా ఆమెపై ఉన్న రూ.25 లక్షల నగదు రివార్డును సుజాతకు అందజేశారు.
ఆమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటేరియట్ మెంబర్గా, దక్షిణ సబ్ జోనల్ బ్యూరో సెక్రటరీగా, జనతన్ సర్కార్ బాధ్యురాలిగా పలు కీలక హోదాల్లో పనిచేశారు. పార్టీ బాధ్యతలతో పాటు, కోయ భాషలో ప్రచురితమయ్యే పేతురి పత్రికకు సంపాదకురాలిగా కూడా ఆమె వ్యవహరించారు.
ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, 2025 మే నెలలో సీపీఐ మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉద్యమం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. పుల్లూరి ప్రసా దరావు అలియాస్ చంద్రన్న, ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయంతో జనజీవన స్రవంతిలో తిరిగి కలవాలనే తన నిర్ణయాన్ని పార్టీ కమిటీకి ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 404 మంది మావోయి స్టులు లొంగిపోయారని తెలిపారు.
అందులో నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజనల్ కమిటీ కార్యదర్శి, ఎనిమిది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు పార్టీలో 78 మంది అజ్ఞాత మావోయిస్టు కేడర్లలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే ఉన్నారని, మొత్తం 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలంగాణకు చెందినవారేనని ఆయన స్పష్టం చేశారు.
సుజాత ప్రస్థానం
ప్రస్తుతం 62 ఏళ్ల వయస్సున్న సుజాత స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికల్పాడు గ్రామం. ఆమె తండ్రి మృతి చెందగా తల్లి, ముగ్గురు సోదరులు ఒక సోదరి ఉన్నారు. పదో తరగతి వరకు ఐజలో, ఇంటర్మీడియట్ గద్వాలలో చదివారు.
మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతుండగా రాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితురాలై చివరకు అడవి బాట పట్టారు. తన 43 ఏళ్ల ఉద్యమ జీవితంలో ఒక్కసారి మాత్రమే పెంచికలపాడు గ్రామానికి వచ్చిన ఆమె మరెప్పుడు కూడా కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులను కానీ కలవలేదు. అనేకసార్లు తృటిలో ఎన్‌కౌంటర్ నుంచి ఆమె తప్పించుకున్నారు.