14-09-2025 01:19:02 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసమే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిసారి ఏఐసీసీ అగ్రనేత రాహు ల్‌గాంధీపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
48 గంటల్లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వెనుక అవినీతిని తేలుస్తామని ప్రతినబూనిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఆ తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనంలో భాగంగానే కాళేశ్వరంపై విచారణ ఆగిందని ఆరోపించారు. కాళేశ్వరం విచారణ నుంచి తప్పించుకునేందుకే బీజేపీ నేతల అడుగులకు కేటీఆర్ మడుగులెత్తుతున్నారని ఆరో పించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి యా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు తెలపకపోవడంతోనే, బీఆర్‌ఎస్ వైఖరి ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పరోక్షంగా ఎన్డీయేకు మద్దతు పలికిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వేర్వేరు కాదని, జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవల వ్యాఖ్యలతో బీజేపీలో బీఆర్‌ఎస్ మానసికంగా విలీనమైందని స్పష్టమైందన్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై కేటీఆర్ తన స్థాయికి మించిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఫిరాయింపులపై రాహుల్ ఎందుకు స్పందిస్తారు?...
ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తారని, ఫిరాయింపులు స్పీకర్ పరిధిలోని అంశమని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. దేశంలో బీజేపీ, ఈసీ కలిసి చేసిన ఓట్ చోరీ యావత్ ప్రపంచం ఆరా తీస్తున్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు, అవకతవకలపై సీబీఐ విచారణ తప్పించుకునేందుకే బీఆర్‌ఎస్ నేతలు నానా తిప్పలు పడుతున్నారని అభిప్రాయపడ్డారు.
కాళేశ్వరం విచారణను రాష్ట్రప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బీజేపీ మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమకు ఎలక్షన్ కమిషన్ నోటీసులివ్వడం కేవలం రాజకీయ కక్ష్య సాధింపు చర్యేనని, ఆ చర్యను ఖండిస్తున్నానని ప్రకటించారు.
2017లో తన చిరునామా మార్చాలని కోట నీలిమ కుటుంబం ఎన్నికల కమిషన్‌కు ఫామ్ ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదని, ఫామ్‌బౌ 6 ప్రకారం తమ విధులు సక్రమంగా నిర్వహించని ఈసీ ఇప్పుడు బీజేపీ ఒత్తిడితో ఆమెకు నోటీసులివ్వడం సరికాదన్నారు. నోటీసులపై కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
అనంతరం యూత్ కాంగ్రెస్ విభాగం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడానికి ముఖ్యకారణం రాహుల్‌గాంధీ అని కొనియాడారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ నేత అనిల్‌యాదవ్ రాజ్యసభ సభ్యుడిగా, మరో ఇద్దరు నేతలు అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్ ఎమ్మెల్సీలుగా ఎదిగారని గుర్తుంచుకోవాలన్నారు.
మున్ముందు విద్యార్థి విభాగం నేతలు ఎంతో ఎదిగే అవకాశం ఉందని ఆకాంక్షించారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్, మహిళ, సేవాదళ్‌లో పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుందని, సమయం వచ్చినప్పుడు పదవులు సైతం కట్టబెడుతుంద న్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పార్టీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారని గుర్తుచేశారు.