14-09-2025 01:16:19 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో సంచలనం సృష్టించిన ఫార్ములా- ఈ-కార్ రేస్ నిర్వహణలో జరిగిన అవకతవకల కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంపై సుధీర్ఘ దర్యాప్తు చేపట్టిన ఏసీబీ తన నివేదికను పూర్తి చేసి, తాజాగా రాష్ర్ట విజిలెన్స్ కమిషన్‌కు సమర్పించింది.
ఈ నివేదికలో ఈ-రేసు నిర్వహణలో జరిగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగం, క్విడ్ ప్రో కో వంటి అంశాలపై స్పష్టమైన ఆధారాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు, నిందితులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవ కాశం ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా -ఈ-రేసులో సుమారు రూ.41 కోట్ల మేర అవినీతి జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, ఏసీబీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏ1గా, సీనియర్ ఐఏఎస్ అధికారి, గత మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ ఏ2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏ3గా, మరో ఇద్దరు ఏ4, ఏ5 నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండుసార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను మూడుసార్లు ప్రశ్నించింది.
రెండు రోజుల్లో తుది నిర్ణయం
ఏసీబీ సమర్పించిన నివేదికను విజిలెన్స్ కమిషన్ రానున్న రెండు రోజుల్లో పరిశీలించి, దీనిపై తుది నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ తర్వాత, ప్రభుత్వం ఈ నివేదికను అధ్యయనం చేసి, అవసరమైన సూచనలతో తిరిగి ఏసీబీకి పంపనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.
నిందితులలో ఎమ్మెల్యే కేటీఆర్, సీనియర్ బ్యూరోక్రాట్ అరవింద్ కుమార్ ఉన్నందున, చార్జిషీట్ దాఖలు చేయడానికి ఏసీబీ గవర్నర్, విజిలెన్స్ కమిషన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ కేసులో తుది నివేదిక విజిలెన్స్ కమిషన్ నుంచి వచ్చిన తర్వాత, ప్రభుత్వ నిర్ణయంపైనే అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది స్పష్టమవుతుంది.